అక్షరటుడే, వెబ్డెస్క్ : Municipal Elections | మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ (BJP) ఫోకస్ పెట్టింది. పుర పోరులో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ మేరకు పార్టీ హైకమాండ్ తెలంగాణపై దృష్టి సారించింది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిలకు (Assembly Elections) ముందు బీజేపీ బలంగా కనిపించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ డీలా పడిపోగా.. కాంగ్రెస్ పుంజుకొని అధికారంలోకి వచ్చింది. 8 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటింది. 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. అనంతరం రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించింది. అయితే కొన్ని రోజులుగా పార్టీ ప్రజల్లోకి వెళ్లడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం తర్వాత నేతల మధ్య సమన్వయం కొరవడిందన్న భావన ఉంది.
Municipal Elections | జూబ్లీహిల్స్లో ఘోర పరాభవం
ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-Election) బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. పంచాయతీ ఎన్నికల్లో సైతం కమలం పార్టీ సత్తా చాటలేకపోయింది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. పంచాయతీ ఎన్నికల్లో తక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో పార్టీ అధిష్టానం తెలంగాణ (Telangana)పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొత్తగా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ చేశారు.
Municipal Elections | ఇన్ఛార్జీల నియామకం
నితిన్ నబిన్ మంగళవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. సాయంత్రం ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణ కోసం ఇన్ఛార్జీలను నియమించారు.మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీగా మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షేలర్ను ప్రకటించారు. కో ఇంఛార్జులుగా అశోక్, రేఖా శర్మను నియమించారు. కాగా ఇప్పటికే జిల్లాలకు రాష్ట్ర నాయకులను ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు.
Municipal Elections | సమన్వయంతో పని చేస్తారా..
రాష్ట్రంలోని కాషాయ పార్టీలో నేతల మధ్య సమన్వయం కొరవడింది. ఎవరికి వారే యమున తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతోనే పార్టీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోతుంది. ఇన్ని రోజులు అధిష్టానం సైతం తెలంగాణపై పెద్దగా ఫోకస్ చేయలేదు. తాజాగా నూతన అధ్యక్షుడు రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దక్షిణాదితో బలోపేతం కోసం చూస్తున్న పార్టీ తెలంగాణ కీలకం కానుంది. అయితే నేతల మధ్య సమన్వయం ఉంటేనే అది సాధ్యం అవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నేతలు సమన్వయంతో పని చేస్తే భారీగా సీట్లు సాధించే అవకాశం ఉంది. పట్టణాల్లో బీజేపీకి ఇప్పటికి బలమైన పట్టు ఉంది.