అక్షరటుడే, కామారెడ్డి : Arrive Alive | ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నినాదంలా కాకుండా రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్యమంలా సాగాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని మంగళవారం కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామంలో ఎస్పీ రాజేష్ చంద్ర ప్రారంభించారు.
Arrive Alive | ఉగ్రవాయి అందరికీ స్ఫూర్తి
జనవరి 13 నుంచి 24 వరకు జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో ఉగ్రవాయి గ్రామంలోనే ఈ మహత్తర కార్యక్రమం ప్రారంభించడానికి కారణం ఉందన్నారు. ఉగ్రవాయి గ్రామస్థులు 11నెలలుగా ఒక్క రోడ్డు ప్రమాద మరణం జరగకుండా జాగ్రత్తలు తీసుకొని స్ఫూర్తిదాతలుగా నిలిచారన్నారు.
Arrive Alive | నిర్లక్ష్యం కారణంగానే..
రోడ్డు ప్రమాదాలు (Road Accidents) యాదృచ్ఛికాలు కావని, అవి వాహనదారుల నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడం అనేది కేవలం చలానాల నుంచి, చట్టం నుంచి తప్పించుకోవడానికి కాదని, అది ప్రాణాన్ని కాపాడే ఆయుధమన్నారు. ఈ విషయాన్ని ప్రతిఒక్క వాహనదారుడు గ్రహించి విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాద మరణాలు జరిగి ఎన్నో కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయని పేర్కొన్నారు.
Arrive Alive | ఆటో డ్రైవర్లు సురక్షితంగా..
ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే బాధ్యతను గుర్తుంచుకోవాలని, మొబైల్ వాడకం, ఓవర్ స్పీడ్, రాంగ్ దిశలో డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని ఎస్పీ సూచించారు. మీకోసం మీ కుటుంబ సభ్యులు ఇంటివద్ద ఎదురుచూస్తున్నారనే విషయం గుర్తించుకొని జాగ్రత్తగా ప్రయాణాలు కొనసాగించాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సభల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 24 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఎస్పీ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు పోలీస్ శాఖ (Police Department)కు సహకరించి, ప్రతిఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy), కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రంజిత్ గౌడ్, ఉగ్రవాయి సర్పంచ్ మహేష్ పాల్గొన్నారు.