అక్షరటుడే, కామారెడ్డి: Journalists Protest | జర్నలిస్టుల అరెస్ట్ హేయమైన చర్య అని కామారెడ్డి జర్నలిస్టులు (Kamareddy journalists) అన్నారు. కలెక్టరేట్ వద్ద వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఉన్న ఎన్టీవీ (N TV) జర్నలిస్టులపై భౌతిక దాడులకు దిగడం, వారిని అరెస్టు చేయడం సరికాదన్నారు.
Journalists Protest | మీడియాపై దాడి గర్హనీయం..
సమాజంలో నాల్గో స్తంభంగా కొనసాగుతున్న మీడియాపై దాడి తగదని జర్నలిస్టులు పేర్కొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉన్న జర్నలిస్టులపై దాడులు చేయడం వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి పోలీసులు కార్యాలయంలోకి వెళ్లి అరెస్టు చేయడం సరికాదన్నారు. చట్టపరంగా ముందుకు వెళ్లాలి తప్ప ఇలాంటి అణిచివేతను జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ మధు మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయ), టెంజు, టీడబ్ల్యూజేఎఫ్, టీఎస్యూజే జర్నలిస్టులు, వివిధ జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.