అక్షరటుడే, వెబ్‌డెస్క్: DRDO | థర్డ్ జనరేషన్ ఫైర్, ఫర్గెట్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌ను డీఆర్డీవో (DRDO) విజయవంతంగా ప్రయోగించింది. మహారాష్ట్రలోని (Maharashtra) అహల్యా నగర్‌లోని కెకె రేంజ్‌లో కదిలే లక్ష్యంపై సోమవారం పరీక్షలు నిర్వహించారు.
స్వదేశీంగా అభివృద్ధి చేయబడిన ఈ క్షిపణిలో ఆల్ ఎలక్ట్రిక్ కంట్రోల్ యాక్చుయేషన్ సిస్టమ్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్ (fire control system) , టెన్డం వార్‌హెడ్, ప్రొపల్షన్ సిస్టమ్, హై పెర్ఫార్మెన్స్ సైటింగ్ సిస్టమ్ వంటి అత్యాధునిక స్వదేశీ సాంకేతికతలు ఉన్నాయి. వీటిని డీఆర్డీవోకు చెందిన రీసెర్చ్ సెంటర్, టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ, ఇన్‌స్ట్రుమెంట్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ సంస్థలు అభివృద్ధి చేశాయి. టార్గెట్ ట్యాంక్‌ను అనుకరించడానికి థర్మల్ టార్గెట్ సిస్టమ్‌ను జోధ్‌పూర్‌లోని డిఫెన్స్ లాబొరేటరీ అభివృద్ధి చేసింది.
DRDO | అభినందించిన రక్షణ మంత్రి
ఈ క్షిపణి పగలు, రాత్రి సమయంలో సైతం ఖచ్చితత్వంలో లక్ష్యాన్ని ఢీకొట్టగలదు. యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడానికి దీనిని తయారు చేశారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (Bharat Dynamics Limited), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (Bharat Electronics) ఈ ఆయుధ వ్యవస్థకు డెవలప్‌మెంట్-కమ్-ప్రొడక్షన్ పార్టనర్స్ (DcPP)గా ఉన్నాయి. ఈ క్షిపణిని ట్రైపాడ్, మిలిటరీ వెహికల్ లాంచర్ నుంచి సులువుగా ప్రయోగించవచ్చు. పరీక్ష విజయవంతం కావడంతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవోను అభినందించారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ఇది ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు.