అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | దేశంలో ఇండిగో ఎయిర్‌లైన్ (Indigo Airline) సంక్షోభంతో వందలాది విమానాలు రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. దీనిపై తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
కేంద్రం నూతనంగా తెచ్చిన కార్మిక చట్టాలపై ట్రేడ్ యూనియన్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. అధికార ఒకరిద్దరి చేతిలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇండిగో సంక్షోభం నిదర్శనం అన్నారు. ఐదు రోజుల నుంచి ఎయిర్‌పోర్ట్‌లు అన్ని రైల్వే స్టేషన్‌లు, బస్ స్టేషన్ల కంటే అధ్వానంగా మారాయని పేర్కొన్నారు. శ్రమ దోపిడి చేయొద్దు, పైలెట్ వారానికి ఇంత సమయం మాత్రమే నడపాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంవత్సరం కింద ఒక రూల్ తెచ్చిందన్నారు.
కేంద్రం నిబంధన తెచ్చిన ఇండిగో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని కేటీఆర్ విమర్శించారు. దీంతో శుక్రవారం ఒక్క రోజు వెయ్యి విమానాలు రద్దు అయ్యాయని చెప్పారు. ఇండిగో దెబ్బకు కేంద్ర మంత్రిత్వ శాఖ (Union Ministry) పెట్టిన రూల్ ను వాళ్ళే వెనక్కి తీసుకున్నారని చెప్పారు. ఇండిగో వెనక్కి తగ్గలేదన్నారు. కానీ కేంద్రం తన ఆదేశాలను ఉపసంహరించుకుందని చెప్పారు. సంపద మొత్తం ఒకరి చేతుల్లోనే ఉంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్నారు.
KTR | లేబర్ కోడ్‌లపై అవగాహన
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కేటీఆర్ అన్నారు. బిల్లు అమలు చేయొద్దని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో కార్మిక చట్టాలను వ్యతిరేకించిన కాంగ్రెస్
రాష్ట్రంలో ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. ఈ బిల్లులకు వ్యతిరేకంగా అఖిలపక్షాన్ని కలుపుకొని పోరాటం చేయాలని సూచించారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి (Former Minister Mallareddy) మాట్లాడితే.. సినిమా టికెట్ రేట్లు పెంచితే అందులో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలని చట్టం తెస్తా అని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారన్నారు. పారిశ్రామిక వాడల భూములను అమ్మితే అందులో కూడా 20 శాతం డబ్బులు పారిశ్రామిక కార్మికులకు ఇవ్వాలనే చట్టం తీసుకు రావాలని డిమాండ్ చేశారు. కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అండగా ఉంటుందన్నారు.
