అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Punjab Police | గణతంత్ర దినోత్సవానికి ముందు రెండు ఉగ్రవాద మాడ్యూల్స్‌ను ఛేదించినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. నిషేధిత సంస్థ BKIకి చెందిన ఆరుగురు కార్యకర్తలను అరెస్టు చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (Babbar Khalsa International) కార్యకర్త, తర్న్ తరణ్‌లోని దినేవాల్ గ్రామానికి చెందిన శరణ్ ప్రీత్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అమృత్‌సర్‌లోని స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ (State Special Operations Cell) భద్రతా సంస్థపై దాడికి అతడు కుట్ర పన్నినట్లు పోలీసు డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ శుక్రవారం తెలిపారు. అతని వద్ద P-86 రకం హ్యాండ్ గ్రెనేడ్, ఒక 9 mm గ్లోక్ పిస్టల్, ఐదు లైవ్ కార్ట్రిడ్జ్‌లు, 65 గ్రాముల ICE (మెథాంఫెటమైన్) డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు.
Punjab Police | మరో ఘటనలో..
పాకిస్థాన్ ఐఎస్ఐ (Pakistan ISI) మద్దతుగల ఉగ్రవాద నెట్‌వర్క్‌పై పోలీసులు దాడి చేశారు. హోషియార్‌పూర్ పోలీసులు (Hoshiarpur Police) జలంధర్‌లోని కౌంటర్ ఇంటెలిజెన్స్‌తో సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఐదుగురు బీకేఐ కార్యకర్తలను అరెస్టు చేసి, 2.5 కిలోల బరువున్న “ఆర్‌డిఎక్స్ ఆధారిత” ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాన్ని, రెండు పిస్టళ్లను, కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. మాడ్యూల్‌ను యూఎస్‌ఏకు చెందిన బీకేఐ హ్యాండ్లర్లు నిర్వహిస్తున్నారు.
నిందితులు రిపబ్లిక్ డే సందర్భంగా పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. హోషియార్‌పూర్‌లోని అరెస్టు అయిన నిందితులను దిల్‌జోత్ సింగ్ సైనీ, హర్మన్ అలియాస్ హ్యారీ, అజయ్ అలియాస్ మెహ్రా, అర్ష్‌దీప్ సింగ్ అలియాస్ అర్ష్ కండోలాగా గుర్తించారు. వీరికి విదేశాల నుంచి మద్దతు లభిస్తోందని డీజీపీ తెలిపారు. పంజాబ్‌లో భయాందోళనలు సృష్టించడానికి వీరు కుట్ర పన్నారని పేర్కొన్నారు.