అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal | కూరగాయల మార్కెట్‌ను తరలించాలని భీమ్‌గల్ మున్సిపల్ కార్యాలయం (Bheemgal Municipal Office) ఎదుట దుకాణదారులు, వ్యాపారులు ఆందోళనకు దిగారు.
వెజిటెబుల్ మార్కెట్ (vegetable market) మార్పులో తీవ్ర ఆలస్యం ఏర్పడుతుండడంతో సోమవారం అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారులు కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కూరగాయల మార్కెట్ వల్ల ట్రాఫిక్, పార్కింగ్, మురుగు నీటితో దుర్వాసన, వ్యర్థాలు పారవేయడం వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మార్కెట్‌ను వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు.
Bheemgal | అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం..
గతంలో అన్ని పార్టీల ప్రతినిధులు ఈ సమస్యలపై మున్సిపల్ కమిషనర్‌కు (Municipal Commissioner) వినతిపత్రం సమర్పించినప్పటికీ నెలలు గడిచినా మార్కెట్ మార్పు దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. మార్కెట్‌ను మారుస్తామని అధికారులు మాటిచ్చినప్పటికీ 70శాతం మంది వ్యాపారులు కొత్త స్థలానికి మారినా.. కొందరు పాత ప్రాంగణం వద్దే ఉండడంతో సమస్యలు తగ్గడం లేదని మండిపడ్డారు. పూర్తిగా తరలించే వరకు ఆందోళనలు చేపడతాయని నాయకులు హెచ్చరించారు.
Bheemgal | పర్యవేక్షణకు ట్రెయినీ ఐఏఎస్ రాక..
పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు భీమ్‌గల్‌కు నియమితులైన ట్రెయినింగ్ ఐఏఎస్ కరోలిన్ చింగ్తియాన్మావి సోమవారం మార్కెట్ ప్రాంతాన్ని సందర్శించారు. పరిస్థితులను పరిశీలించి.. వ్యాపారవేత్తలు, ప్రజలతో మాట్లాడారు. అనంతరం మున్సిపల్ అధికారులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. మార్కెట్ మార్పు ప్రక్రియను తక్షణమే వేగవంతం చేయాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సాయంత్రం ఐదు గంటల వరకు రోడ్డుపై నిరసన కొనసాగింది. తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని ఆందోళనకారులు భీష్మించుకు కూర్చున్నారు.
