అక్షరటుడే, ఇందూరు : BRS Nizamabad | కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా (Former MLA Bigala Ganesh Gupta) అన్నారు. తెలంగాణ విజయ్ దివస్ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
BRS Nizamabad | మహోన్నత వ్యక్తి కేసీఆర్..
ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR) దీక్షను భగ్నం చేయడానికి అక్రమంగా అరెస్టు చేసినా.. నిరాహార దీక్షను కొనసాగించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని బిగాల కొనియాడారు. ప్రజల దశాబ్దాల పోరాటానికి తలవంచి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) దిగి వచ్చిందన్నారు. ఆర్టికల్–3 ద్వారా తెలంగాణ ప్రజల దశాబ్దాల వాంఛ నెరవేరిందని పేర్కొన్నారు.
BRS Nizamabad | ధన్పాల్ ప్రకటనను ఖండిస్తున్నాం..
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి రూ.100 కోట్ల నిధులు తీసుకువచ్చానని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రకటించడాన్ని ఖండిస్తున్నట్లు బిగాల గణేశ్ గుప్తా తెలిపారు. గతంలో జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆనాటి సీఎం కేసీఆర్ అర్బన్ అభివృద్ధి పనుల కోసం రూ.100 కోట్ల నిధులు ప్రకటించారన్నారు. జీవో వచ్చిన వెంటనే పట్టణంలో ఆర్ఆర్ చౌరస్తా నుంచి పాత కలెక్టర్ మైదానం వరకు కృతజ్ఞత ర్యాలీ కూడా నిర్వహించామని గుర్తు చేశారు.
BRS Nizamabad | ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు..
సుమారు 90 శాతం పనులకు తాము భూమి పూజ చేశామని.. కానీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తన హయాంలో రూ.100 కోట్ల నిధులు తెచ్చానని ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) చెప్పుకోవడం సమంజసం కాదని బిగాల అన్నారు. కేసీఆర్ హయాంలో మంజూరైన రూ.100 కోట్ల నిధులతో నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి పునాదులు వేసి శిలాఫలకాలు ఏర్పాటు చేశామన్నారు. అభివృద్ధిలో పోటీపడి మాకంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా పనిచేయాలన్నారు. అంతేకానీ తమ హయాంలో వచ్చిన నిధులను తానే తీసుకువచ్చినట్లు ప్రచారం చేయడం తగదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ దాదన్న గారి విఠల్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ మేయర్ నీతూ కిరణ్, నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, చింతకాయల రాజు తదితరులు పాల్గొన్నారు.