అక్షరటుడే, హైదరాబాద్ : Teenmar Mallanna | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)పై తీన్మార్ మల్లన్న విష ప్రచారం చేస్తున్నాడని తెలంగాణ జాగృతి నాయకులు మండిపడ్డారు. అగ్గిపెట్టె హరీశ్‌రావు (Harish Rao) డైరెక్షన్లో బీఆర్ఎస్ విష కౌగిలిలో చేరి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ జాగృతి బంజారాహిల్స్ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్, జాగృతి నాయకులు ఆనంద్, మాధవి విలేకరులతో మాట్లాడారు.
తీన్మార్ మల్లన్నవి నీచ, దిగజారుడు, బ్లాక్ మెయిల్ రాజకీయాలని మండిపడ్డారు. కాంగ్రెస్ మంత్రి వర్గంలోకి కవితను తీసుకునే ప్రయత్నం చేశారంటూ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జూన్ 8న ముగ్గురు కాంగ్రెస్ మంత్రులు ప్రమాణం చేశారని అప్పుడు కవిత బీఆర్ఎస్లోనే ఉన్నారనే సోయి కూడా లేకుండా మల్లన్న మాట్లాడుతున్నారన్నారు. మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టేలా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్పీ అనే పార్టీ పెట్టిన మల్లన్న కాంగ్రెస్ బీఫాం మీద గెలిచిన ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు.
Teenmar Mallanna | ఇష్టానుసారంగా మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త
తీన్మార్ మల్లన్న పార్టీకి ఇంకా గుర్తు కూడా రాలేదని.. కచ్చితంగా నీకు క్యూఆర్ కోడ్ ఉన్న గుర్తు రావాలని కోరుకుంటున్నామని శ్రీకాంత్ గౌడ్ అన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసే నీచమైన వ్యక్తివి అంటూ మండిపడ్డారు. టీఆర్పీ పార్టీ (TRP Party) పేరు టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ అని పెట్టుకోవాలని సూచించారు. నీ ఛానెల్ వ్యూస్ కోసం ఇష్టానుసారం మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. సిగ్గు, లజ్జ లేని వ్యక్తి తీన్మార్ మల్లన్న అని వ్యాఖ్యానించారు.
Teenmar Mallanna | అంత భూమి ఎలా వచ్చింది..
ఛాయ్‌కి పైసలు అడుక్కున్న మల్లన్నకు హెచ్ఎండీఏ పరిధిలో 660 ఎకరాల భూమి ఎలా వచ్చిందో చెప్పాలని జాగృతి నాయకుడు ప్రశ్నించారు. స్కూటీపై తిరిగే నీకు హెలికాప్టర్లో ప్రచారానికి వెళ్లేంత డబ్బులు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. సాయి ఈశ్వరాచారి అనే బీసీ బిడ్డ ఆత్మహత్యకు నువ్వు కారణమా కాదా చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతా చారి ఆత్మబలిదానం చేసుకున్నట్లే నువ్వు బీసీల కోసం బలిదానం చేసుకోవాలంటూ ఆయనను రెచ్చగొట్టలేదా అని ప్రశ్నించారు. కచ్చితంగా ఈశ్వరాచారి మరణం తీన్మార్ మల్లన్న చేసిన హత్యేనని శ్రీకాంత్ గౌడ్ విమర్శించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Teenmar Mallanna | వీడియోలు తీసి బ్లాక్మెయిల్
న్యాయం కోసం పేదలు నీ దగ్గరకు వస్తే వారిని కూడా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన నీచ చరిత్ర మల్లన్నదని శ్రీకాంత్ గౌడ్ (Srikanth Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద వారి నుంచి బడా కార్పొరేట్ సంస్థల వరకు బ్లాక్ మెయిల్ చేసి రూ. వేల కోట్లకు పడగెత్తావని విమర్శించారు. కవితక్క మీద అవాకులు పేలినందుకు గతంలోనే నీ పై దాడి చేశామని, మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేస్తే ఈసారి పాతళంలోకి తొక్కుతామని హెచ్చరించారు.
Teenmar Mallanna | తరిమి కొడతాం..
కవిత మీద అవాకులు పేలితే కుక్కను తరిమినట్లు తరిమికొడతామని జాగృతి నేత ఆనంద్ హెచ్చరించారు. హరీశ్‌రావు ఎంగిలి మెతుకులకు అమ్ముడు పోయి కవితక్క మీద ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఆడబిడ్డల మీద నువ్వు మాట్లాడుతున్న మాటల కారణంగా.. వాళ్లు రాజకీయాలకు రావాలంటే భయపడుతున్నారన్నారు.
Teenmar Mallanna | నీ విధానం ఏంటో చెప్పు
హరీశ్ రావు ఇచ్చిన సొమ్ముతో కవిత మీద పిచ్చికుక్కలా తీన్మార్ మల్లన్న మొరుగుతున్నాడని జాగృతి మహిళా నాయకురాలు మాధవి మండిపడ్డారు. కవిత కాలి గోటికి కూడా సరిపోని వ్యక్తి మల్లన్న అని విమర్శించారు. బీసీల కోసం పార్టీ పెట్టానని చెబుతున్న మల్లన్న వెనుక అసలు ఎంత మంది బీసీలు ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ను తిట్టి, ఇప్పుడు కాంగ్రెస్‌ను తిడుతున్నావ్ అని.. అసలు నీ పార్టీ ఏంటో, విధానాలు ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు.