అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Team India | భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచీ (Ranchi) వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించి లీడింగ్‌లో ఉంది. ఇక రెండవ మ్యాచ్ రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం (International Stadium) వేదికగా జరుగుతుండగా, ఈ మ్యాచ్‌లోను భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది.
తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో గెలిచిన భారత్, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే కసితో భారీ స్కోరు చేసింది. రుతురాజ్ (Ruturaj), విరాట్ కోహ్లీలు సెంచరీలు సాధించడంతో 50 ఓవర్లలో భారత్ (India) ఐదు వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. సౌతాఫ్రికా (South Africa) జట్టు తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో కెప్టెన్ టెంబా బావుమా, కేశవ్ మహారాజ్, లుంగీ ఎంగిడితో సహా మూడు మార్పులు చేయగా, భారత్ ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగింది.
Team India | భారీ టార్గెట్..
అయితే భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నాడు. రాంచీలో జరిగిన మొదటి వన్డేలో సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ, రాయ్‌పూర్‌లో (Raipur) జరిగిన రెండో వన్డేలో కూడా మరో శతకంతో మైమరపించాడు. కేవలం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించడం కోహ్లీ క్లాస్‌కు నిదర్శనం. రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో కోహ్లీ 90 బంతుల్లో శతకాన్ని పూర్తి చేశాడు. ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో కోహ్లీ కెరీర్‌లో 53వ వన్డే సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు రాంచీ వన్డేలో 120 బంతుల్లో 135 పరుగులు చేసిన కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఫార్మాట్‌లో 51 కంటే ఎక్కువ సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచి సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.
రాయ్‌పూర్ మ్యాచ్‌లో 40వ ఓవర్ తొలి బంతికి ఏరియల్ షాట్ ఆడే ప్రయత్నంలో కోహ్లీ మార్క్రామ్‌కు క్యాచ్ ఇచ్చి 102 పరుగులకు ఔట్ అయ్యాడు. అయితే రుతురాజ్(105)తో కోహ్లీ చక్కని భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ ఇద్దరూ కలిసి 156 బంతుల్లో 195 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసి మ్యాచ్ మొమెంటమ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పారు. రుతురాజ్ కూడా ఈ మ్యాచ్‌లో 77 బంతుల్లో తన కెరీర్‌లో తొలి వన్డే సెంచరీని నమోదు చేయడం విశేషం. రెండు సెంచరీలతో టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది. తాజా ఐసీసీ (ICC) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ తన రికార్డు ప్రదర్శనతో నాలుగో స్థానానికి ఎగబాకాడు. రాంచీలో చేసిన 135 పరుగుల శతకం, రాయ్‌పూర్‌లో చేసిన మరో సెంచరీ కోహ్లీ రేటింగ్‌ను పెంచాయి. కాగా.. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(22), రోహిత్ శర్మ(14), వాషింగ్టన్ సుందర్(1), రవీంద్ర జడేజా (24, 27 బంతుల్లో ), కేఎల్ రాహుల్( 66 నాటౌట్: 43 బంతుల్లో) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్స్‌లో యాన్సన్ 2, ఎంగిడి 1, బర్గర్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
