అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs NZ | రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టు (New Zealand team) అద్భుత ప్రదర్శనతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు (The Indian team) నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.
అయితే 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు సమంగా నిలవగా, ఫలితం కోసం మూడో వన్డే కీలకంగా మారింది. న్యూజిలాండ్ విజయానికి డారిల్ మిచెల్ (Mitchel) శతక ఇన్నింగ్స్ ప్రధాన కారణంగా నిలిచింది. అతడు కేవలం 96 బంతుల్లోనే సెంచరీ సాధించి భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. మరోవైపు విల్ యంగ్ 87 పరుగుల వద్ద అవుట్ కాగా, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో నితీష్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. భారత బౌలింగ్‌లో హర్షిత్ రాణా డెవాన్ కాన్వేను, ప్రసిద్ధ్ కృష్ణ హెన్రీ నికోల్స్‌ను అవుట్ చేయగా, అయినప్పటికీ కివీస్ బ్యాటింగ్‌ను నియంత్రించడంలో భారత్ విఫలమైంది.
IND vs NZ | ఓటమికి ఇదే కారణాలు..
ఇదే మ్యాచ్‌లో భారత జట్టు తరఫున కేఎల్ రాహుల్ (Kl Rahul) ఒంటరి పోరాటం చేశాడు. 92 బంతుల్లో అజేయంగా 112 పరుగులు చేసిన రాహుల్ తన ఎనిమిదో వన్డే సెంచరీని నమోదు చేశాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 56 పరుగులతో అర్ధ సెంచరీ సాధించగా, రోహిత్ శర్మ 24, విరాట్ కోహ్లీ (Virat Kohli) 23 పరుగులు మాత్రమే చేశారు.
చివర్లో రవీంద్ర జడేజా 27 పరుగులతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. న్యూజిలాండ్ బౌలింగ్‌లో క్రిస్టియన్ క్లార్క్ మూడు వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్‌ను కుదిపేశాడు. అరంగేట్ర ఆటగాళ్లు జాడెన్ లెన్నాక్స్, జాక్ ఫాల్క్స్, కైల్ జామిసన్‌తో పాటు కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ తలా ఒక వికెట్ తీసి జట్టుకు కీలక సహకారం అందించారు.
ఇక ఈ మ్యాచ్‌తో కేఎల్ రాహుల్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌పై ఐదో బ్యాటింగ్ స్థానంలో సెంచరీ సాధించిన అతడు, వన్డే క్రికెట్‌లో 1వ స్థానం నుంచి 6వ స్థానం వరకు అన్ని బ్యాటింగ్ స్థానాల్లో శతకాలు చేసిన ప్రపంచంలోని ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌తో సిరీస్ మరింత ఆసక్తికరంగా మారగా, నిర్ణయాత్మక మూడో వన్డేపై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. అయితే ఓటమిపై స్పందించిన గిల్ (Subhman Gill).. బౌలింగ్‌లో మాకు మంచి ఆరంభమే లభించిన ఆ తర్వాత మాత్రం సరైన సమయంలో వికెట్స్ తీయలేకపోయారు. అదే మా ఓటమిని శాసించింది అన్నాడు గిల్.