అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bihar | బీహార్‌లో ఓ ఉపాధ్యాయురాలు దారుణ హత్యకు గురైంది. దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున టీచర్లు నిరసన చేపడుతున్నారు. బాధిత యువతికి న్యాయం చేయాలని కోరుతున్నారు. బీహార్‌లోని అరారియా జిల్లా (Araria District)లో బుధవారం ఉదయం ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపారు.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బారాబంకి ప్రాంతానికి చెందిన శివానీ కుమారి (28) ఖబ్డా కన్హైలి మిడిల్ స్కూల్‌లో కాంట్రాక్ట్ టీచర్‌గా చేరింది. ఆమె బుధవారం పాఠశాలకు స్కూటీపై వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో శివాని అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే టీచర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Bihar | ఇటీవల నిశ్చితార్థం
స్థానికుల ప్రకారం, శివాని కొన్ని నెలల క్రితమే అరారియాలో చేరింది. నర్పత్‌గంజ్ (Narpatganj)లో అద్దెకు ఉంటూ జీవిస్తోంది. రోజుల క్రితమే నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయినట్లు సమాచారం. ఈ క్రమంలో మృతురాలి సోదరి జూలీ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు ఒక సంవత్సరం క్రితం అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రంజిత్ కుమార్ వర్మ తనను వివాహం చేసుకోవాలని శివానిపై ఒత్తిడి తెచ్చాడని ఆరోపించింది. ఈ క్రమంలో ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరగడంతో ఆయనే హత్య చేయించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
శివాని తండ్రి ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (Circle Inspector)గా పని చేస్తున్నారు. ఆమె ఇద్దరు సోదరీమణులు బీహార్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. జూలీ వర్మ తన సోదరికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా శివానికి మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోరాటం సాగుతోంది. జస్టిస్ ఫర్ శివాని హ్యాష్ ట్యాగ్ ఎక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దీంతో పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
