అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Chief Minister Revanth Reddy) ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పాలేరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
సీఎం రేవంత్రెడ్డి సభలో టీడీపీ జెండాలు (TDP flags) తీవ్ర చర్చకు దారి తీశాయి. పాలేరు సభలో పలువురు టీడీపీ జెండాలతో హాజరు అయ్యారు. అంతేగాకుండా సీఎం టీడీపీ గురించి మాట్లాడినప్పుడు సభ ప్రాంగణాన్ని హోరెత్తించారు. సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలో సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబుకు (senior NTR and Chandrababu) అభిమానులు ఉన్నారని తెలిపారు. తెలంగాణలో టీడీపీ నాయకత్వాన్ని దెబ్బ తీసిన బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బొంద పెట్టిన రోజే సీనియర్ ఎన్టీఆర్కి నిజమైన నివాళులు అర్పించినట్లు అన్నారు. ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ పై కక్ష కట్టిన కేసీఆర్, బీఆర్ఎస్ని వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలని నందమూరి అభిమానులను, చంద్రబాబు అభిమానులను ఆయన కోరారు.
CM Revanth Reddy | అందుకోసమేనా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ టీడీపీకి అభిమానులు ఉన్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో టీడీపీ, బీజేపీ కూటమిగా ఉన్నాయి. దీంతో తెలంగాణలో ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో టీడీపీ మద్దతుదారులను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి తాజాగా సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆయన గతంలో టీడీపీ నుంచి వచ్చిన వారే కావడంతో పురపోరులో ఆ పార్టీ మద్దతుదారుల ఓట్ల కోసం తాజా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
CM Revanth Reddy | రాజకీయ వర్గాల్లో కీలక చర్చ
రేవంత్రెడ్డి పాలేరు సభలో టీడీపీ జెండాలు, ఆయన వ్యాఖ్యలు తాజాగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో సీఎం సభలో ఆ పార్టీ జెండాలు పట్టుకొని హాజరు కావడం గమనార్హం. మరోవైపు బీఆర్ఎస్ కొంతకాలంగా చంద్రబాబు శిష్యుడు రేవంత్రెడ్డి అని ప్రచారం చేస్తోంది. గురుదక్షిణ రేవంత్ తెలంగాణ నీళ్లను ఇస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో సీఎం టీడీపీకి అనుకూలంగా మాట్లాడటం గమనార్హం. ఆ వ్యాఖ్యలను బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మల్చుకునే అవకాశం ఉంది.