అక్షరటుడే, వెబ్‌డెస్క్: America | వెనిజుల అధ్యక్షుడిని బంధించిన అమెరికా.. ఇరాన్‌పై దాడులకు సిద్ధం అని ప్రకటించింది. మరోవైపు గ్రీన్‌ల్యాండ్ (Greenland) స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు తాజాగా కీలక బిల్లును ప్రవేశ పెట్టింది.
గ్రీన్‌ల్యాండ్ డెన్మార్క్ (Denmark) ఆధీనంలో ఉంది. దానిని స్వాధీనం చేసుకోవాలని అగ్రరాజ్యం యోచిస్తోంది. ఈ మేరకు గ్రీన్‌లాండ్ విలీనం, రాష్ట్ర హోదా పేరుతో రిపబ్లికన్ నేత రాండీ ఫైన్ బిల్లు ప్రవేశపెట్టారు. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాలోని 51వ రాష్ట్రంగా మార్చడానికి ఈ బిల్లు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. డెన్మార్క్‌తో చర్చలు జరపడం, గ్రీన్‌ల్యాండ్‌ను యునైటెడ్ స్టేట్స్ భూభాగంగా విలీనం చేయడం, స్వాధీనం చేసుకోవడం వంటి అవసరమైన చర్యలు తీసుకోవడానికి తమ అధ్యక్షుడికి అధికారం ఉందని ఆయన అన్నారు.
America | యూఎస్‌కు కీలకం
గ్రీన్‌ల్యాండ్ ఆర్కిటిక్‌లో ఉన్నందున అది US భద్రతకు చాలా ముఖ్యమైనదని ఫైన్ వాదించారు. ఇది వాణిజ్యం, సైనిక కదలిక, ఇంధన రవాణా కోసం ఉపయోగించే కీలక షిప్పింగ్ మార్గాలను నియంత్రించగలదన్నారు. తమ ప్రత్యర్థులు అక్కడ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. అలా జరగనివ్వకుండా.. దానిని స్వాధీనం చేసుకుంటామని రాండీ పేర్కొన్నారు.
America | రష్యా, చైనా చర్యలతో.
ప్రపంచ అధికార పోరాటంలో ఆర్కిటిక్ ప్రాంతం చాలా ముఖ్యమైనదిగా మారుతోందని ట్రంప్ (Donald Trump), విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చెబుతున్నారు. చైనా, రష్యా వంటి దేశాలు అక్కడ సైనిక ఉనికిని పెంచడం, నౌకలను నిర్మించడం చేస్తున్నాయి. ఆర్కిటిక్‌లో తమ ప్రభావాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నాయని వారు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో దానిని స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ యోచిస్తున్నారు. గత వారం వైట్ హౌస్ (White House) సమావేశంలో, “గ్రీన్‌ల్యాండ్‌పై మేము ఏదైనా చేయబోతున్నాము, వారు ఇష్టపడినా ఇష్టపడకపోయినా” అని ట్రంప్ అన్నారు. భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి బలప్రయోగం చేయాలని సూచించారు. అమెరికా అధికారులు ప్రతి గ్రీన్లాండ్ నివాసికి 10వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు అందించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వారు అమెరికా చర్యలకు మద్దతు తెలుపుతారని భావిస్తున్నారు.