అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Trap | రాష్ట్రంలోని తహశీల్దార్ కార్యాలయాలు (Tahsildar offices) అవినీతి కేంద్రాలుగా మారాయి. నిత్యం ఏదో ఒక కార్యాలయంలో లంచం తీసుకుంటూ అధికారులు ఏసీబీ(ACB)కి చిక్కుతున్నారు. అన్ని కార్యాలయాల్లో అవినీతి అధికారులున్నా.. తహశీల్దార్ కార్యాలయాల్లో మాత్రం లంచాలకు మరిగిన అధికారులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి భయం లేకుండా లంచం డిమాండ్ చేస్తున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ ఓ తహశీల్దార్ (Tahsildar) ఏసీబీకి చిక్కాడు.
జగిత్యాల (Jagityala) జిల్లా రాయికల్ (Rayikal) మండల ఇన్‌ఛార్జి తహశీల్దార్, జటంగుల గణేష్ లంచం తీసుకుంటూ దొరికాడు. ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవసాయ భూమిని నమోదు చేయడానికి ఆయన లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం బాధితుడి నుంచి రూ.పది వేల లంచం తీసుకుంటుండగా ఇన్‌ఛార్జి తహశీల్దార్ గణేష్, ప్రైవేట్ దస్తవేజు లేఖరుడు మహ్మద్ ముజఫర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ACB Trap | భయపడాకుండా ఫిర్యాదు చేయాలి
ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే అవినీతి అధికారుల పని చెబుతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.