అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | భర్తలో పుట్టిన అనుమానం చివరకు ఒక కుటుంబాన్ని పూర్తిగా ఛిద్రం చేసింది. ఆనందంగా సాగాల్సిన దాంపత్య జీవితం అనుమానాల విషవలయంలో చిక్కుకుని, చివరకు దారుణ హత్యకు దారి తీసింది. హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ (Borabanda Police Station) పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, వనపర్తి జిల్లా (Wanaparthy District) చింతకుంటకు చెందిన రొడ్డె ఆంజనేయులు, కొల్లాపూర్‌కు చెందిన సరస్వతిని 14 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి 12 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఉపాధి కోసం కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన ఆంజనేయులు, రహమత్‌నగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ (Rajiv Gandhi Nagar)లో అద్దెకు నివాసం ఉంటున్నాడు.
Hyderabad | అనుమానం ఎంత పని చేసింది
ఆంజనేయులు వృత్తిరీత్యా కారు డ్రైవర్‌గా పనిచేస్తూ, కొందరితో కలిసి జూబ్లీహిల్స్ (Jubilee Hills) ప్రాంతంలో కార్ల కొనుగోలు–అమ్మకాల వ్యాపారం చేస్తున్నాడు. మరోవైపు సరస్వతి హైటెక్ సిటీ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో హౌస్‌కీపింగ్ సూపర్‌వైజర్‌గా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే కొంతకాలంగా ఆంజనేయులు భార్యపై అనుమానం పెంచుకొని ఆమెను మానసికంగా వేధించసాగాడు. సరస్వతి ఫోన్‌ను తనిఖీ చేయడం, ఆమె పని చేసే ప్రాంతానికి వెళ్లి గమనించడం వంటి చర్యలతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంజనేయులు ఉద్యోగాలు మానేసి తిరగడం ప్రారంభించాడు. సరస్వతి పలుమార్లు పని చేయమని చెప్పినా వినిపించలేదు. ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో పిల్లల చదువులు కూడా మధ్యలో ఆగిపోయాయి. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన సరస్వతి, ఇటీవల పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
తర్వాత ఆంజనేయులు అత్తగారింటికి వెళ్లి పెద్దల సమక్షంలో నచ్చజెప్పడంతో, గొడవలు పెట్టుకోనని హామీ ఇచ్చి ఈ నెల 17న భార్యా పిల్లలను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. సోమవారం రోజంతా విధులు ముగించుకొని వచ్చిన సరస్వతి, పిల్లలకు భోజనం పెట్టి నిద్రకు ఉపక్రమించింది.అయితే భర్తలోని అనుమానం మాత్రం తగ్గలేదు. అదే రాత్రి అర్ధరాత్రి సమయంలో, పిల్లలతో కలిసి గాఢనిద్రలో ఉన్న సరస్వతి తలపై రోకలిబండతో ఆంజనేయులు దాడి చేశాడు. తీవ్ర గాయాల కారణంగా ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తల్లి పక్కనే నిద్రిస్తున్న పిల్లల దుస్తులు కూడా రక్తంతో తడిసిపోయాయి. పిల్లలు కదలడంతో, “అమ్మ పడుకుంది.. మీరు నిద్రపోండి” అంటూ చెప్పి ఆంజనేయులు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు.కొంతసేపటికి భయంతో పిల్లలు లేచి లైట్ వేయగా, తల్లి రక్తపుమడుగులో పడి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే సమీపంలో నివసిస్తున్న మేనమామ సుధాకర్‌కు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. ఆయన సంఘటన స్థలానికి చేరుకొని 100కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు (Borabanda Police) వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్య అనంతరం ఆంజనేయులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో, హత్య చేసిన తర్వాత ఆంజనేయులు తన సోషల్ మీడియా స్టేటస్‌లో “నా జీవిత భాగస్వామిని నేనే నా చేతులారా చంపుకున్నా” అంటూ ఫోటో స్టేటస్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా, గతంలో సరస్వతి సోదరుడు ప్రశాంత్‌పై కూడా ఆంజనేయులు కత్తితో దాడి చేయడంతో కేసు నమోదైందని సమాచారం.