అక్షరటుడే, వెబ్డెస్క్ : Bus Accident | సౌదీ అరేబియా (Saudi Arabia)లో నవంబర్ 17న చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం హైదరాబాద్‌కు చెందిన కుటుంబాలను శోకసముద్రంలో ముంచేసింది.
మదీనా వైపు ప్రయాణిస్తున్న యాత్రికుల బస్సుని వెనుకనుంచి ట్యాంకర్ ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం (Major Fire Accident) సంభవించి, బస్సులో ఉన్న 46 మందిలో 45 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో బయటపడ్డ ఒకే ఒక్క వ్యక్తి మహమ్మద్ అబ్దుల్ షోయబ్ అక్కడే చికిత్స తీసుకొని రీసెంట్‌గా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయన ప్రమాదానికి ముందు ఏం జరిగిందో వెల్లడించారు.
Saudi Arabia Bus Accident | ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది?
ఏఎన్ఐతో మాట్లాడిన అబ్దుల్ షోయబ్ హృదయాన్ని కలచివేసే వివరాలు వెల్లడించారు. మేమంతా మదీనాకు వెళ్తున్నాం. ఒక ప్రయాణికుడు మూత్ర విసర్జన కోసం బస్సు ఆపమని డ్రైవర్‌ను కోరాడు. డ్రైవర్ బస్సును రోడ్డుపక్కన ఆపగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ట్యాంకర్ బస్సుని బలంగా ఢీకొట్టింది అని చెప్పారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ కిటికీ నుండి బయటకు దూకి, ప్రయాణికులను వదిలి పారిపోయాడని షోయబ్ ఆరోపించారు. బస్సులో మంటలు విపరీతంగా వ్యాపించాయి. నా బట్టలు సైతం కాలిపోయాయి. నేను కిటికీ నుంచి ప్రాణాలతో బయటపడ్డాను అని చెప్పారు. ఈ ప్రమాదంలో షోయబ్ తండ్రి, తల్లి, తాత సహా మిగిలిన 45 మంది దుర్మరణం పాలయ్యారని కన్నీటి పర్యంతం అయ్యారు.
షోయబ్ మాట్లాడుతూ .. ఇప్పుడు నాకు ఎలాంటి మద్దతు లేదు. నా కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలో మృతి చెందింది. అందుకే నాకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఒక ఉద్యోగంతో సహాయం చేయాలి అని అభ్యర్థించారు. కాగా, ప్రమాదం గురించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం .. హైదరాబాద్ (Hyderabad)కు చెందిన 54 మంది నవంబర్ 9న ఉమ్రా యాత్రకు బయలుదేరారు. మక్కా (Makka)లో పవిత్ర స్థలాల దర్శనాలు ముగించుకున్న తర్వాత, 46 మంది ఆదివారం మదీనాకు ఒకే బస్సులో బయలుదేరారు. మిగతా నలుగురు కారులో, ఇంకో నలుగురు వ్యక్తిగత కారణాలతో మక్కాలోనే ఉన్నారు. మదీనాకు బయలుదేరిన బస్సు హైవేపై వెళ్లుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది.తీవ్ర వేగంతో వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టడంతో బస్సు మంటలు అంటుకొని ప్రయాణికులు బయటపడే అవకాశం లేకుండా పోయింది.
