అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Supreme Court | తమిళనాడులోని (Tamil Nadu) కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు సోమవారం ఆదేశించింది. సుప్రీంకోర్టు (Supreme Court) మాజీ జడ్జి పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
తొక్కిసలాట కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు (Central Bureau of Investigation) బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 27న టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, హీరో విజయ్ (TVK party founder and hero Vijay) నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుని 41 మంది మృతి చెందారు. ఈ ఉదంతం తర్వాత విజయ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు రాగా, ఘటనపై విచారణ కోసం స్టాలిన్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే, తొక్కిసలాట వెనుక ప్రభుత్వమే ఉందన్న అనుమానాలతో టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ దారుణం వెనుక కారణాలు వెలికి తీసేందుకు కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరింది.
Supreme Court | త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో..
టీవీకే విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. సీబీఐకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణను పర్యవేక్షించేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యుల కమిటీకి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వం వహిస్తారని, తమిళనాడు కేడర్‌కు చెందిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఇందులో ఉంటారని జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. అయితే, ఆ ఐపీఎస్ అధికారులు (IPS officers) తమిళనాడుకు చెందినవారు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
Supreme Court | విజయ్ ర్యాలీలో తొక్కిసలాట
తమిళ రాజకీయాల్లోకి (Tamil Nadu politics) వచ్చిన సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే దిశగా విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గత నెల 27న ఆయన కరూర్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు పొద్దంతా నిరీక్షించడం, ఒక్కసారిగా తోపులాట మొదలు కావడంతో పరిస్తితి అదుపుతప్పింది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 60 మందికిపైగా గాయపడ్డారు. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన హైకోర్టు ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది.
Supreme Court | సుప్రీంకు వెళ్లిన టీవీకే..
అయితే, ఐపీఎస్ అధికారి అశ్రా గార్గ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఇచ్చిన ఆదేశాలను టీవీకే సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఘటనపై దర్యాప్తునకు హైకోర్టు రాష్ట్ర పోలీసు అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తమ పార్టీ పట్ల సిట్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. టీవీకే విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
3 comments
[…] తమిళనాడులోని కరూర్‌లో 41 మంది మృతికి దారితీసిన తొక్కిసలాట ఘటన దర్యాప్తు విషయంలో సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణ బాధ్యతలను **సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)**కి అప్పగించింది. […]
[…] నిషేధిస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) గతంలో తీర్పునిచ్చింది. దీనిపై […]
[…] క్రితం జరిగిన ఈ ఘటనపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం కీలక విచారణ నిర్వహించి […]
Comments are closed.