అక్షరటుడే, ఇందూరు: Inter school sports | జిల్లాలో ఎందరో జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దిన క్రీడా గురువు సుబ్బారావు అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Pcc Chief Bomma), అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal) కొనియాడారు. ప్రైవేటు పీఈటీ అసోసియేషన్ (Private PET Association) ఆధ్వర్యంలో ఎంవీ సుబ్బారావు స్మారకార్థం అర్బన్ అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలను పాత కలెక్టరేట్ గ్రౌండ్లో సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. క్రీడలను.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. జిల్లాలో అన్ని హంగులతో స్టేడియం (Sports Stadium) నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏడాది క్రీడల కోసం తన ట్రస్ట్ నుంచి నిధులు అందజేస్తానని హామీ ఇచ్చారు. తాను కరాటేలో ఉన్నప్పటి నుంచే సుబ్బారావు సుపరిచితులన్నారు. ఎంతోమంది క్రీడాకారులనులను ఉత్తమంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు.
Inter school sports | సుబ్బారావును స్ఫూర్తిగా తీసుకోవాలి..
కబడ్డీలో ఉత్తమ క్రీడాకారుడిగానే కాకుండా ఉత్తమ గురువుగా ఎంతో సేవచేసిన సుబ్బారావును క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. గత 13 ఏళ్లుగా అర్బన్‌లో క్రీడలు నిర్వహించలేకపోవడం విచారకరమన్నారు. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే జిల్లా క్రీడాభివృద్ధి కోసం స్టేడియం కోసం ప్రస్తావించానని గుర్తు చేశారు.
పాత కలెక్టరేట్ మైదానంలో ఎటువంటి సౌకర్యాలు లేకున్నా సాధన చేసిన ఎందరో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారన్నారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు విద్యార్థులు చేసిన మార్చ్‌పాస్ట్ ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో నుడా ఛైర్మన్ కేశ వేణు, డీఈవో అశోక్ కుమార్, డీవైఎస్వో పవన్ కుమార్, ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగమణి, ప్రైవేట్ పీఈటీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అజ్మత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.




