అక్షరటుడే, కామారెడ్డి: Heavy rains | మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండిపోతున్నాయి. కొన్నిచోట్ల వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో 15 మంది విద్యార్థులు చిక్కుకున్న ఘటన సదాశివనగర్ (Sadashivanagar) మండలం అమర్లబండలో (amarla banda) శనివారం చోటుచేసుకుంది.
గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామంలో హైస్కూల్ లేకపోవడంతో విద్యార్థులు ప్రతిరోజూ ధర్మరావుపేట గ్రామానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో గ్రామ శివారులో ఉన్న రాజగుండ వాగు దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఉదయం వాగులో అంతగా నీళ్లు లేకపోవడంతో విద్యార్థులు స్కూల్కు వెళ్లారు. వర్షాలు పడుతుండడంతో త్వరగానే స్కూల్కు వెళ్లారు. కాగా.. అప్పటికే వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. విషయం తెలుసుకున్న సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సై పుష్పరాజ్ గ్రామానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో కేజ్ వీల్ సహాయంతో విద్యార్థులను ఒడ్డుకు చేర్చారు. మరికొంత మంది రైతులు సైతం వాగుకు అటువైపు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. వారిని ట్రాక్టర్ల ద్వారా ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
వర్షాలు కురిసిన సమయంలో రాజగుండ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నెల 19న రాత్రి వ్యవసాయ పనులకు వెళ్లిన ఐదుగురు రైతులు వాగులో చిక్కుకోగా ట్రాక్టర్ల సహాయంతో గ్రామస్థులు ఒడ్డుకు చేర్చారు. సరిగ్గా వారం రోజులకు అదే వాగులో శనివారం 15 మంది విద్యార్థులు చిక్కుకున్నారు.
Heavy rains | బ్రిడ్జి నిర్మిస్తేనే సమస్యకు పరిష్కారం
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఉంటుందని ఏర్పడుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు చదువుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు ఇదే దారి ఉందని చెప్తున్నారు. బ్రిడ్జి నిర్మిస్తే తప్ప తమకు ఈ బాధలు తీరవని పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.