అక్షరటుడే, వెబ్డెస్క్ : Cyclone Montha | బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాను బలపడడంతో తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీరానికి 270 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ సమీపంలో ఉంది.
వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. మొంథా తుపాను మచిలీపట్నం – కాకినాడ మధ్య ప్రాంతంలో ఈరోజు (మంగళవారం) సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. మొంథా ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) ప్రకారం.. వచ్చే 24 గంటల్లో నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ , మరో 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Cyclone Montha | వర్షాలే వర్షాలు..
తెలంగాణలో (Telangana) కూడా తుపాను ప్రభావం కనిపిస్తోంది. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే ఆదిలాబాద్, జనగామ, ఖమ్మం, కొమురంభీం, మంచిర్యాల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సిద్దిపేట, సూర్యాపేట ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో (Hyderabad) కూడా బుధవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరప్రాంతాల ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు. సముద్రం ఉప్పొంగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్ర యాత్రలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను కారణంగా విజయవాడ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఎయిర్ ఇండియా, ఇండిగో సర్వీసులు కూడా రద్దయ్యాయి. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో విమాన సర్వీసులు (Indigo Flights) కూడా రద్దయినట్టు తెలుస్తోంది.