అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | ఇరాన్ (Iran)తో వ్యాపారం చేసే ఏ దేశంపైనైనా 25 శాతం సుంకాన్ని విధిస్తామని, ఆ దేశంలో నిరసనకారులపై అణచివేతను ఆపడానికి సైనిక చర్య తీసుకునే అవకాశమూ ఉందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) హెచ్చరికలతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. ఇరాన్ సైతం యుద్ధానికి సిద్ధమంటూ ప్రకటించడంతో ఆందోళన నెలకొంది. దీంతో మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ప్రధాన సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి.
మంగళవారం ఉదయం సెన్సెక్స్ 201 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 179 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 680 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 2 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడితో 199 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 23 పాయింట్ల నష్టంతో 83,854 వద్ద, నిఫ్టీ (Nifty) 6 పాయింట్ల నష్టంతో 25,784 వద్ద ఉన్నాయి.
ఇండస్ట్రియల్, టెలికాం రంగాల్లో ఒత్తిడి..
ఇండస్ట్రియల్, ఆటో, రియాలిటీ, టెలికాం రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. మెటల్, కమోడిటీ సెక్టార్లు రాణిస్తున్నాయి. బీఎస్‌ఈలో మెటల్ ఇండెక్స్ 0.98 శాతం, కమోడిటీ 0.54 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.37 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.28 శాతం, ఐటీ 0.26 శాతం లాభాలతో ఉన్నాయి. రియాలిటీ ఇండెక్స్ 0.98 శాతం, టెలికాం 0.79 శాతం, ఇండస్ట్రియల్ 0.70 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.64 శాతం, ఇన్‌ఫ్రా, క్యాపిటల్ గూడ్స్ 0.54 శాతం, ఆటో 0.49 శాతం, సర్వీసెస్ 0.45 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.36 శాతం లాభాలతో ఉండగా.. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.31 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.13 శాతం నష్టంతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 13 కంపెనీలు లాభాలతో ఉండగా.. 17 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఎటర్నల్ 2.94 శాతం, టెక్ మహీంద్రా 1.77 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.50 శాతం, ఎస్‌బీఐ 0.92 శాతం, టీసీఎస్ 0.74 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎల్‌టీ 2.02 శాతం, ఇండిగో 1.52 శాతం, ట్రెంట్ 1.38 శాతం, రిలయన్స్ 1.09 శాతం, ఎయిర్‌టెల్ 0.85 శాతం నష్టాలతో ఉన్నాయి.