అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, బోధన సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
యూనివర్సిటీ అభివృద్ధి (University Development) పనులపై ముఖ్యమంత్రి శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. యూనివర్సిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తొలుత అధికారులు వివరించారు. హాస్టల్ భవనాలు (Hostel Buildings), రహదారులు, అకడమిక్ బ్లాక్స్, ఆడిటోరియం నిర్మాణాలకు సంబంధించి పలు మార్పులు చేర్పులను సూచించారు. యూనివర్సిటీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పనులకు అర్బన్ ఫారెస్ట్రీ నిధులు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు.
CM Revanth Reddy | జలవనరులను రక్షించాలి
యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికే ఉన్న జల వనరులను సంరక్షిస్తూనే నూతన జల వనరుల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని సీఎం పేర్కొన్నారు. హాస్టల్, అకడమిక్ భవనాల (Academic Buildings) నిర్మాణం విషయంలో వంద మంది విద్యార్థులుంటే అదనంగా మరో పది శాతం విద్యార్థులకు వసతులు ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులు, సిబ్బంది భవిష్యత్తులోనూ ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్మాణాలు ఉండాలని సూచించారు. చారిత్రక, వారసత్వ భవనాలను సంరక్షించాలని చెప్పారు. ఉస్మానియా విద్యార్థుల పోరాట ప్రతిమను ప్రతిబింబించే చిహ్నాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
CM Revanth Reddy | 10న ఓయూకు వస్తా..
ఈ నెల 10 ఓయూను సందర్శించనున్నట్లు సీఎం తెలిపారు. ప్రధానంగా అకడమిక్ బ్లాక్‌లు, హాస్టళ్లను పరిశీలిస్తానని చెప్పారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఓయూ వైస్ ఛాన్సెలర్ మొలుగురం కుమార్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం తదితరులు పాల్గొన్నారు.
