అక్షరటుడే,భీమ్‌గల్ : Bheemgal | యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడల వైపు మళ్లాలనే లక్ష్యంతో భీమ్‌గల్ మండలం (Bheemgal Mandal) ముచ్కూర్ గ్రామ యువత ఆదర్శంగా నిలిచింది. గ్రామానికి చెందిన ‘చిన్న హనుమాన్ యూత్’ సభ్యులు ఏగోళం గంగాధర్ గౌడ్, మంచిర్యాల సంతోష్, అన్నారం మహేష్‌లు ఇటీవల హఠాన్మరణం చెందారు. తమ మిత్రుల స్మారకార్థం యూత్ సభ్యులు రెండు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ (Cricket Tournament)ను ఘనంగా నిర్వహించారు.
Bheemgal | ఉత్కంఠభరితంగా సాగిన పోటీలు..
ఈ టోర్నీలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు 26 జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో భీమ్‌గల్ -11 జట్టు విజేతగా నిలిచి ప్రథమ బహుమతిని కైవసం చేసుకోగా.. ముచ్కూర్ గాంధీ యూత్ జట్టు (Muchkur Gandhi Youth Team) రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు బాధిత కుటుంబ సభ్యుడు అనిల్ గౌడ్, చిన్న హనుమాన్ యూత్ సభ్యులు బహుమతులను అందజేశారు.
Bheemgal | మానవత్వం చాటుకున్న గల్ఫ్ మిత్రులు..
కేవలం ఆటలకే పరిమితం కాకుండా, మరణించిన మిత్రుడు మంచిర్యాల సంతోష్ కుటుంబాన్ని ఆదుకునేందుకు యూత్ సభ్యులు ముందుకొచ్చారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ముచ్కూర్ యూత్ సభ్యులు పంపిన విరాళాలతో పాటు, ఇక్కడి సభ్యుల సహకారంతో కలిపి ఆర్థిక సాయాన్ని సంతోష్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
Bheemgal | గంజాయి వద్దు.. గ్రౌండే ముద్దు..
ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ.. ‘గంజాయి వద్దు – గ్రౌండే ముద్దు’, ‘మత్తు వదులు – మైదానం పట్టు’ అనే నినాదాలతో తోటి యువతకు పిలుపునిచ్చారు. చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని, క్రీడల ద్వారా శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని కోరారు. మిత్రుల జ్ఞాపకార్థం టోర్నీ నిర్వహించిన చిన్న హనుమాన్ యూత్ సభ్యులను గ్రామ ప్రజలు, వివిధ సంఘాల నేతలు ప్రత్యేకంగా అభినందించారు.