అక్షరటుడే, బాల్కొండ : Sriramsagar project | మత్స్యకార కార్మికుల fishermen జీవితాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చేపల కోసం చెరువులోకి వెళ్లి వలలో చిక్కి నీట మునిగి మరణించడం తరచూ జరిగే ఘటనలు.
బతుకు దెరువు కోసం కుల వృత్తినే నమ్ముకున్న మత్స్యకార కార్మికులు ప్రమాదం అని తెలిసినా తప్పని పరిస్థితుల్లో నీటిలో దిగుతూ ప్రమాదానికి గురికావడం పరిపాటిగా మారింది.
తాజాగా మరో మత్స్య కార్మికుడు బలయ్యాడు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద నీటిలో చేపలు పడుతూ గల్లంతయ్యాడు. వరద గేట్ల వద్ద గోదావరి Godavari లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Sriramsagar project | నీటి ప్రవాహానికి ఎదురెళ్లడంతో..
మెండోరా ఎస్సె సుహాసిని, స్థానిక మత్స్యకార్మికుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా సోన్ మండలం గాంధీనగర్‌కు చెందిన లింబోజి అనిల్(25), లింబోజి ఆనంద్ ఇద్దరు అన్నదమ్ములు.
వీరు శనివారం (అక్బోబరు 4) మధ్యాహ్నం చేపలు పట్టేందుకు గోదావరిలోని వరద గేట్ల వద్ద నీటిలో దిగారు. కాగా, వరద గేట్ల వద్ద ప్రవాహానికి ఎదురెళ్లడంతో అనిల్ తెప్ప తలకిందులైంది.
దీంతో ఆయన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. ఆనంద్ మాత్రం ప్రవాహం పక్కన ఉన్న బండరాయిని పట్టుకుని బతికిపోయాడు.
ఇతర మత్స్య కార్మికులు గమనించి జలాశయం అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వరద గేట్లను మూసివేశారు. అనంతరం గాలింపు చర్యలు చేపట్టారు.
చీకటి పడే వరకు వెతికినా అనిల్ ఆచూకీ లభించలేదు. దీంతో గాలింపు చర్యలను నిలిపివేసి, మళ్లీ వరద గేట్లు తెరిచి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. ప్రమాదకరంగా చేపల వేటకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని ఎస్సె సూచించారు.