అక్షరటుడే, వెబ్‌డెస్క్: Train Accident | స్పెయిన్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర రైలు ప్రమాదం ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. దేశ దక్షిణ ప్రాంతమైన కొర్డోబా ప్రావిన్స్ (Córdoba Province)లో రెండు హై-స్పీడ్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో సుమారు 100 మంది వరకు గాయపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో ఒక రైలు డ్రైవర్ కూడా ఉండటం పరిస్థితి తీవ్రతను మరింత పెంచింది. వివరాల్లోకి వెళ్తే.. మాలాగా నుంచి రాజధాని మాడ్రిడ్‌కు ప్రయాణిస్తున్న ‘ఇర్యో’ అనే ప్రైవేట్ హై-స్పీడ్ రైలు అదుపుతప్పి పట్టాలు తప్పింది. ఈ క్రమంలో దాని వెనుక బోగీలు పక్కనే ఉన్న మరో ట్రాక్‌పైకి దూసుకెళ్లాయి.
Train Accident | ఘోర ప్రమాదం..
అదే సమయంలో మాడ్రిడ్ నుంచి హుయెల్వా (Madrid to Huelva) వెళ్తున్న ప్రభుత్వ రంగానికి చెందిన ‘రెన్ఫే’ హై-స్పీడ్ రైలు ఆ మార్గంలో వేగంగా వస్తుండటంతో, పట్టాలు తప్పిన ఇర్యో రైలు బోగీలను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో రెన్ఫే రైలు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొర్డోబా ప్రావిన్స్‌లోని అడముజ్ గ్రామం (Adamuj Village) సమీపంలో జరిగిన ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ముఖ్యంగా ఇటీవలే ఆధునీకరణ పనులు పూర్తైన ట్రాక్‌పై ఈ ప్రమాదం జరగడం పట్ల స్పెయిన్ రవాణా శాఖ మంత్రి (Spain’s Transport Minister) ఆస్కార్ పుయెంటె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన మార్గంలో ఇలాంటి ప్రమాదం జరగడం చాలా వింతగా ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవల బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, సైన్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. శిథిలాల మధ్య చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై స్పెయిన్ ప్రభుత్వం (Spanish Government) ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ప్రమాదానికి గల కారణాలపై సాంకేతిక నిపుణులు, రైల్వే అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టనున్నారు. భద్రతా చర్యల్లో ఏవైనా లోపాలున్నాయా అనే కోణంలోనూ విచారణ జరగనుంది. ప్రమాదం నేపథ్యంలో మాడ్రిడ్–అండలూసియా మార్గంలో రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.