అక్షరటుడే, వెబ్డెస్క్ : Hanumakonda Police | పోలీస్ స్టేషన్ నుంచి గంజాయి స్మగ్లర్లు తప్పించుకున్నారు. ఈ ఘటన వరంగల్ పోలీస్ కమిషనరేట్ (Warangal Police Commissionerate) పరిధిలోని హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది.
గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని నార్కోటిక్ బ్యూరో పోలీసులు (Narcotics Bureau Police) ఆదివారం అరెస్ట్ చేశారు. అనంతరం వారిని, స్వాధీనం చేసుకున్న గంజాయిని హన్మకొండ పోలీసులకు అప్పగించారు. ఠాణాలో ఉన్న వారు సోమవారం తెల్లవారుజామున తప్పించుకున్నట్లు సమాచారం. విధుల్లో ఉన్న సిబ్బంది కళ్లు కప్పి నిందితులు ఠాణా నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.
Hanumakonda Police | పాత బైక్‌పై..
కంప్యూటర్ వద్ద ఉన్న డోరు కట్ చేసి, స్టేషన్‌లో ఉన్న తాళం లేని పాత బైక్‌పై నిందితులు తప్పించుకున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హన్మకొండ మధ్యలో ఉన్న స్టేషన్ నుంచి నిందితులు తప్పించుకోవడం తీవ్ర కలకలం రేపింది. మామూనూరు ఠాణా (Mamoonur Police Station) నుంచి గత నెలలో ఇద్దరు గంజాయి దొంగలు పరార్ అయ్యారు. ఆ సమయంలో ఉన్నతాధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరించిన ఇద్దరు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం ముగ్గురు స్మగ్లర్లు తప్పించుకోవడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.