అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Phone tapping case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)కు తాజాగా నోటీసులు జారీ చేసింది.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao)ను విచారించిన విషయం తెలిసిందే. మంగళవారం ఆయనను సుమారు 7 గంటల పాటు సిట్ ప్రశ్నించింది. తాజాగా కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు రావాలని పేర్కొంది.
Phone tapping case | నోటీసుల డ్రామా
కేటీఆర్‌కు నోటీసులపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. బొగ్గు స్కాం (Coal Scam)పై సమాధానం చెప్పే దమ్ములేకనే రేవంతు నోటీసుల డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ (congress) వరుస స్కాంల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులు ఇస్తోందన్నారు. రేవంతు బామ్మర్ది బొగ్గు స్కాం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్లు మండిపడ్డారు. ప్రతీకారం అనేది బలహీనుల ఆయుధం అన్నారు. నోటీసులకు సమాధానాలు చెప్పడానికి తాము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నాయకులతో పాటు సినీ ప్రముఖులు, జడ్జీలు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేసు నమోదు అయింది. దాదాపు రెండేళ్లుగా కేసు విచారణ సాగుతోంది. అయితే ప్రభుత్వం విచారణ వేగవంతం చేయడానికి ఇటీవల సిట్ ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వ పెద్దలు చెప్పడంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ భావిస్తోంది. ఈ క్రమంలో విచారణ చేస్తోంది. ఇటీవల ప్రభాకర్‌రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావు, న్యూస్ ఛానెల్ ఎండీ శ్రవణ్‌రావును విచారించారు. ఇటీవల హరీశ్‌రావును ప్రశ్నించారు. మరోసారి ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. తాజాగా కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో కేసీఆర్ (KCR)ను సైతం విచారణకు పిలుస్తారని ప్రచారం జరుగుతోంది.