అక్షరటుడే, వెబ్‌డెస్క్: BRS Sirpur Kagaznagar | తెలంగాణలో అసెంబ్లీ Telangana Assembly ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడే రాజకీయ వేడి పెరుగుతోంది. ముఖ్యంగా సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గం గులాబీ పార్టీకి కొత్త సవాల్‌గా మారుతోందన్న చర్చ జోరుగా నడుస్తోంది. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మరోవైపు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరూ ఈ నియోజకవర్గంపైనే పట్టుబట్టి రాజకీయ బలప్రదర్శనకు దిగడంతో, పరిస్థితి అధిష్టానానికి ఇబ్బందికరంగా మారినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
BRS Sirpur Kagaznagar | కొత్త తలనొప్పి
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు ఈ ఇద్దరి మధ్య ఉన్న అంతర్గత విభేదాలను మరోసారి బయటకు తెచ్చినట్లయ్యింది. పార్టీ గుర్తు లేని ఎన్నికలకే వర్గాలుగా చీలిపోయి అభ్యర్థులను నిలబెట్టడం, గెలుపు లెక్కలపై పరస్పర పోటీ మొదలవడం అధిష్టానాన్ని ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. కోనప్ప వర్గం ఎక్కువ గ్రామ పంచాయతీల్లో విజయం సాధించడంతో వారి శిబిరం ఉత్సాహంగా ఉండగా, ఆర్ఎస్పీ వర్గంలో మాత్రం అసంతృప్తి పెరిగిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ప్రొటోకాల్ పాటించడం లేదని కోనప్పపై ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానిక రాజకీయాలపై Politics పూర్తి పట్టు తనకే ఉందని కోనప్ప భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల పంపిణీ అధికారం ఎవరి చేతిలో ఉండాలన్న అంశం కూడా వివాదాస్పదంగా మారుతోంది. ఒక వర్గం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు బీఫారాల అధికారం ఇవ్వాలని కోరుతుంటే, మరొక వర్గం కోనప్పకే ఎక్కువ రాజకీయ బలం ఉందని వాదిస్తోంది.
BRS Sirpur Kagaznagar | గత అసెంబ్లీ ఎన్నికల్లో..
గత అసెంబ్లీ Assembly ఎన్నికల్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, పార్టీ మార్పులు, ఓటముల బాధలు ఇప్పటికీ ఈ ఇద్దరి మధ్య నీడలా వెంటాడుతున్నాయని పార్టీ లోపలే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరూ బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నప్పటికీ, భవిష్యత్తులో టికెట్ ఎవరికి అన్న ప్రశ్న పార్టీని కఠిన నిర్ణయాల ముందు నిలబెడుతోందట. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో గులాబీ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా, అంతర్గత ఐక్యత లేకపోతే నష్టం తప్పదన్న ఆందోళన అధిష్టానంలో ఉన్నట్లు సమాచారం. గతంలోనే సమన్వయంతో పనిచేయాలని అధినేత కేసీఆర్ సూచించినప్పటికీ, తాజా రాజకీయ పరిణామాలు మళ్లీ వర్గపోరును తెరపైకి తీసుకొచ్చాయని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కోనప్ప–ఆర్ఎస్పీ వ్యవహారంలో బీఆర్ఎస్ హైకమాండ్ ఎలాంటి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో పెరుగుతోంది.