అక్షరటుడే, వెబ్డెస్క్: Supreme Court | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (Sir) కొనసాగాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సవరణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో (Supreme Court) దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) ఎస్‌ఐఆర్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రక్రియలో భాగమైన బీఎల్‌వోలు, ఇతర అధికారులకు బెదిరింపులు వస్తుండడాన్ని సుప్రీం సీరియస్గా పరిగణించింది. ఈ ఘటనలను తమ దృష్టికి తేవాలని.. లేకపోతే గందరగోళ పరిస్థితులు ఎదురవొచ్చంటూ హెచ్చరించింది. బీఎల్‌వోలకు బెదిరింపులు, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అంతరాయాలపై తమ దృష్టికి తీసుకువస్తే.. వారి భద్రతకు తగిన ఆదేశాలు ఇస్తామని పేర్కొంది.
బీఎల్‌వోలు ఒత్తిడికి లోనయితే వారి స్థానంలో ఇతరులను తీసుకోవడం వంటి మార్గాలను పరిశీలించాలన్నారు. కానీ.. ఎస్‌ఐఆర్ మాత్రం కొనసాగేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ నిర్వహణలో అవాంతరాలు ఏర్పడితే.. అధికారులను రక్షించడానికి పోలీసుల సహకారం తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం న్యాయస్థానానికి వెల్లడించింది.