అక్షరటుడే, వెబ్డెస్క్: Naini Coal Mines | సింగరేణి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా పరమైన కారణాలతో నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఒడిశాలోని నైనీ బొగ్గు గనులకు సింగరేణి (Singareni) గతంలో టెండర్లు పిలిచింది. ఈ విషయంలో దుమారం రేగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉండేవారికి టెండర్లు కట్టబెట్టడానికి సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం తెచ్చారని బీఆర్ఎస్ (BRS) ఆరోపించిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka)పై సైతం ఈ టెండర్ల విషయంలో ఓ వార్త పత్రికలో ఆరోపణలు ప్రచురించింది. దీంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెండర్లు రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు తాజాగా టెండర్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ సింగరేణి నిర్ణయం తీసుకుంది.
Naini Coal Mines | గతంలో సైతం..
నోటిఫికేషన్ ప్రకారం ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి నైనీ గనుల బిడ్స్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పాలనాపరమైన కారణాలతో టెండర్ రద్దు చేస్తున్నట్లు SCCL ప్రకటించింది. నైనీ టెండర్ల విషయంలో సింగరేణి పాలకమండలిని కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రశ్నించింది. సంస్థ విధించిన నిబంధనలపై పాలకమండలి ఎందుకు చర్చించలేదని సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ ఆరా తీశారు. ఒకవేళ చర్చిస్తే.. టెండర్ల విషయంలో అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. టెండర్ వేయదలచిన కంపెనీలకు ఎందుకు సైట్ విజిట్ ధ్రువీకరణ పత్రాలు (Site Visit Certificate) ఎందుకు ఇవ్వడం లేదన్నారు. దీంతో టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని సింగరేణి అధికారులు తెలిపారు. నిబంధనలు, టెండర్లపై పాలక మండలిలో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా 2016లో సైతం నైనీ టెండర్ల విషయంలో ఆరోపణలు వచ్చాయి. అప్పుడు కూడా అధికారులు రద్దు చేశారు. తాజాగా రెండోసారి నైనీ కోల్ మైన్స్ టెండర్స్ రద్దు కావడం గమనార్హం.