అక్షరటుడే, వెబ్‌డెస్క్: Silver Price | బంగారం, వెండి ధరలు (Gold and silver prices) ఆకాశాన్ని అంటుతున్నాయి. రాకెట్ వేగంతో ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇటీవల సిల్వర్ రేట్ ప్రజలకు షాక్ ఇస్తోంది.
వెండి ధరలు (Silver prices) ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. ఏడాది క్రితం కిలో వెండి రూ.లక్ష దాటింది. తాజాగా రూ.రెండు లక్షలకు చేరువలోకి వచ్చింది. బంగారంతో సమానంగా వెండికి సైతం ఇటీవల డిమాండ్ పెరిగింది. దీంతో దీని రేట్లు పెరుగుతున్నాయి. బుధవారం కిలో వెండి రూ.1.84 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో రూ.రెండు లక్షలకు సైతం సిల్వర్ రేటు చేరింది.
బంగారం ధరలు సైతం భారీగానే పెరుగుతున్నాయి. గతంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మధ్యలో కొంత మేర తగ్గాయి. దీంతో రేట్లు ఇంకా తగ్గుతాయని ప్రజలు ఆశించారు. అయితే మళ్లీ ధరలు వాయువేగంతో పెరుగుతున్నాయి. తాజాగా తులం బంగారం రూ.1.30 లక్షలపైనే పలుకుతోంది. డాలర్‌తో రూపాయి విలువ ఇటీవల భారీగా పతనం అయింది. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
Silver Price | వెండిపై ఆసక్తి..
బంగారం ధరలు భారీగా పెరగడంతో పేద, మధ్య తరగతి (middle class) వారు వెండిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఎలాగు బంగారం కొనే పరిస్థితి లేకపోవడంతో కనీసం వెండినైనా కొని పెట్టుకొవాలని ప్రజలు భావిస్తున్నారు. దీంతో సిల్వర్‌కు డిమాండ్ పెరిగింది. ఫలితంగా రేట్లు సైతం పెరిగాయి. అలాగే విద్యుత్ కార్లు, ఫోన్ల తయారీలో సైతం ఈ లోహాన్ని వినియోగిస్తున్నారు. అంతేగాకుండా ఇన్వెస్టర్లు సైతం బంగారంతో పాటు వెండిపై మదుపు చేస్తున్నారు. బంగారం ధరలు భారీగా పెరగడంతో చిన్న మదుపరులు వెండిని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. ఫలితంగా ఈ లోహం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
