అక్షరటుడే, వెబ్డెస్క్ : Sankranti Festival | సంక్రాంతి పండుగ రాగానే గ్రామాల్లో, పట్టణాల్లో ఒక ప్రత్యేకమైన సందడి కనిపిస్తుంది. “అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు” అనే స్వరాలతో ఇంటి ముందు గంగిరెద్దు (బసవన్న) వచ్చిందంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరి దృష్టి అటు వైపు మళ్లుతుంది.
పిల్లలు ఆసక్తిగా చూస్తుంటే, పెద్దలు భక్తిశ్రద్ధలతో పూజ చేసి ఆహారం, వస్త్రాలు, కానుకలు సమర్పిస్తారు. ఇది కేవలం ఒక సంప్రదాయం కాదు… తరతరాలుగా వస్తున్న విశ్వాసానికి ప్రతీక. అలాగే “హరిలో రంగ హరి” అంటూ శ్రీమహావిష్ణువు (Sri Mahavishnuvu)ను స్మరిస్తూ హరిదాసులు ఇంటింటికి తిరుగుతుంటారు. నుదుట మూడు నామాలు, చేతిలో తంబురా, చిడతలు, తలపై ప్రత్యేక పాత్రతో వారు చేసే హరినామ సంకీర్తన పండుగ వాతావరణానికి మరింత ఆధ్యాత్మికతను చేకూరుస్తుంది.
Sankranti Festival | అసలు కథ ఏంటంటే..
సంక్రాంతి వేళ హరిదాసు (Haridasu)లకు బియ్యం, కానుకలు ఇవ్వడం కూడా ఒక శుభాచారంగా భావిస్తారు. ఈ ఇద్దరూ సంక్రాంతి సమయంలోనే ఎందుకు కనిపిస్తారన్న ప్రశ్న చాలామందికి ఉంటుంది. చాలామంది వీరిని కేవలం దానం కోసం వచ్చే వారిగా భావిస్తారు. కానీ సంప్రదాయ విశ్వాసాల ప్రకారం, హరిదాసులు శ్రీమహావిష్ణువు ప్రతిరూపాలుగా, బసవన్నలు సాక్షాత్తూ పరమేశ్వరుని వాహనమైన నందీశ్వరుడిగా భావిస్తారు. భక్తులను ఆశీర్వదించేందుకే వారు ఇంటింటికీ వస్తారని పెద్దలు చెబుతారు. భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్లు వేసి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తారు. ఆ ముగ్గుల మధ్య నిల్చునే హరిదాసులు, గంగిరెద్దులు దానం స్వీకరించడానికే కాదు… ధర్మబద్ధమైన నేలపై నిలబడి ఆశీస్సులు ఇవ్వడానికే అని నమ్మకం. అందుకే ఆ సమయంలో ఇచ్చే దానం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు.
గంగిరెద్దుల అలంకారానికి కూడా ప్రత్యేకత ఉంటుంది. రంగురంగుల బట్టలు, అద్దాలు, చెమ్కీలు, గంటలు, గజ్జెలతో అలంకరించిన నందీశ్వరుడు ఇంటింటికి రావడం పాడిపంటలకు శుభసూచకంగా భావిస్తారు. కళాకారులు సన్నాయి, డోలు, బూర వాయిస్తూ పాటలు పాడుతుంటే, ఆ వాతావరణం పండుగ కళను రెట్టింపు చేస్తుంది. ఇక హరిదాసు తలపై ఉంచుకునే గుమ్మడికాయ ఆకారపు పాత్ర భూమికి సంకేతం. భూమిని ఉద్ధరించే శ్రీహరి భావనకు అది ప్రతీకగా చెబుతారు. వారు వెనక్కి తిరగకుండా, ఎవరికీ అడగకుండా, ఎవరైనా ఇచ్చిన దానినే స్వీకరిస్తూ హరినామం చేస్తూ ముందుకు సాగుతారు. ఇది సమానత్వం, భక్తి, వినయానికి చిహ్నంగా భావిస్తారు.