అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shravan Panchami : సమస్త జీవకోటిలోనూ దేవుడున్నాడని నమ్మే సనాతన ధర్మాన్ని(Sanatana Dharma) అనుసరించేవారు ప్రతి ప్రాణిని పూజిస్తారు. విష సర్పాలనూ నాగదేవతగా భావించి, ఆరాదిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పక్ష పంచమిని నాగ పంచమి(Naga Panchami) లేదా నాగులు పంచమిగా పేర్కొంటారు. కొందరు గరుడ పంచమిగానూ జరుపుకుంటారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి ఏడాదంతా ఏ సమస్యలూ ఉండవని, చేపట్టిన కార్యాలు నెరవేరుతాయని భక్తులు(devotees) నమ్ముతారు. అందుకే ఈ రోజున పుట్టల వద్దకు వెళ్లి పాలుపోసి నాగదేవతను పూజిస్తారు. స్కంద పురాణంలో(Skanda Purana) నాగ పంచమి విశిష్టతను సాక్షాత్తూ ఆ పరమ శివుడే వివరించాడని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.
శ్రావణ పంచమికి మరో విశిష్టత కూడా ఉంది. ఇది బద్ధశత్రువులైన నాగులు, గరుడుడు జన్మించిన రోజు. కశ్యప ప్రజాపతికి(Kashyapa Prajapati) ఇద్దరు భార్యలు. వారి పేర్లు వినత, కద్రువ. వారి సంతానమే గరుత్మంతుడు, నాగులు. శ్రావణ పంచమి రోజే వినతకు గరుత్మంతుడు(Gurutmanthudu), కద్రువకు నాగులు జన్మించారు. కాబట్టి ఈ రోజును నాగ పంచమి, గరుడ పంచమి పేర్లతో పిలుస్తారు.
Shravan Panchami : నాగ పంచమి వ్రత కథ..
పూర్వం ధనవంతురాలైన ఓ గృహిణి ఉండేది. ఆమెకు రోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా కలలు వచ్చేవి. దీంతో ఆమె భయకంపితురాలయ్యేది. ఒక రోజున ఇంటికి వచ్చిన కులగురువుతో(Guru) తన బాధను వెల్లబోసుకుంది. ఆయన అంతా విని.. ‘అమ్మా.. నువ్వు గత జన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు. అందువల్ల నీకు ఈ జన్మలో ఈ శిక్ష సంక్రమించింది’ అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము ఆచరించాలని సూచించారు. కుల గురువు చెప్పినట్లుగా ఆమె నాగపంచమి నోము ఆచరించడంతో స్వప్న దోషాలు తొలగిపోయాయి. అప్పటినుంచి నాగపంచమి రోజున పాములను పూజించడం ప్రారంభమైందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. కాలసర్ప దోషం ఉన్నవారు ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి, కాలసర్ప దోష శాంతి చేయించుకుంటారు. దాంతో దోష నివారణ కొంత జరుగుతుందని నమ్ముతారు.
Shravan Panchami : శుభాల కోసం నాగ పూజలు..
సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుందని, కాలసర్ప, నాగదోషాలు(Nagadosham) తొలగిపోతాయని విశ్వసిస్తారు. సంతాన భాగ్యం కోసం ఈ పంచమి రోజు నాగులను పూజించి, గోధుమలతో(Wheat) చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి ఆహారం తీసుకుంటారు. నాగ పంచమి రోజున నాగులను పూజించినవారికి విష బాధలు ఉండవని నమ్ముతారు. నాగపంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరుడికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయని, అనంత పద్మనాభ స్వామికి అభిషేకం, అలంకారాలు చేయించిన వారికి ఈతి బాధలు తొలగి, ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయన్నది భక్తుల విశ్వాసం. ఈ రోజున మట్టి తవ్వడం, చెట్లను నరకడం చేయకూడదని పెద్దలు సూచించారు.
Shravan Panchami : గరుడ పంచమి
కశ్యప ప్రజాపతి ఆయన భార్యలు వినత, కద్రువల సంతానమే గరుత్మంతుడు, నాగులు. శ్రావణ పంచమి రోజే వినతకు(Vinata) గరుత్మంతుడు, కద్రువకు నాగులు జన్మించారు. కాబట్టి నాగ పంచమి, గరుడ పంచమి పేర్లతో పిలుస్తారు. నాగపంచమిలాగే గరుడ పంచమి వ్రతాన్ని కూడా కొందరు ఆచరిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండాలని, స్త్రీలు తమకు పుట్టిన పిల్లలు గరుత్మంతుడిలా బలంగా, చురుగ్గా ఉండాలని ఆకాంక్షిస్తూ గరుడ పంచమి పూజ చేస్తారు. గరుత్మంతుడులాంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని స్త్రీలు గరుడ పంచమి వ్రతం చేస్తారు. తిరుమలలో(Tirumala) స్వామివారు గరుడ పంచమినాడు మాడవీధులలో గరుడ వాహనంపై ఊరేగుతారు. ఈ వ్రతాన్ని తమకు పెద్దల నుంచి అనూచానంగా వస్తున్న విధానం ప్రకారం చేస్తారు. ఆనవాయితీగా వస్తున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని చేయాలి. లేనివారు స్నానం చేసి శుచిగా ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్ అనే గరుడ గాయత్రి మంత్రాన్ని పఠిస్తే శుభాలు కలుగుతాయని భావిస్తారు.