అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cabinet Reshuffle | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతుంది. దీంతో ప్రజా పాలన వారోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న సందర్భంగా మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet)లో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి 16 మంది ఉన్నారు. రాష్ట్రం 18 మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రిపదవి ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గాన్ని మార్చాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు సమాచారం.
Cabinet Reshuffle | రెండు సార్లు విస్తరణ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు. అనంతరం చాలా మంది మంత్రి పదవులను ఆశించారు. మినిస్టర్ పోస్ట్ రేసులో అనేక మంది ఉండటంతో చాలాకాలం చర్చల తర్వాత కాంగ్రెస్ జూన్‌లో మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరిలకు పదవులు ఇచ్చింది. అనంతరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటీవల మరోసారి మంత్రివర్గాన్ని విస్తరించింది. అజారుద్దీన్‌కు కేబినెట్ బెర్త్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం కేబినెట్లో 16 మంది ఉన్నారు. మరో రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి.
Cabinet Reshuffle | కొత్తగా పలువురికి అవకాశం
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఆది నుంచి మంత్రిపదవి ఆశిస్తున్నారు. పదవి రాకపోవడంతో ఆయన పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. అలాగే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి (MLA Malreddy Ranga Reddy) సైతం పదవి ఆశించి భంగపడ్డాడు. ఈ క్రమంలో తాజాగా పునర్ వ్యవస్థీకరణ చేపట్టి కొత్తవారికి అవకాశం కల్పించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ (Konda Surekha), పొన్నం ప్రభాకర్‌తో పాటు మరో ఇద్దరిని మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పొన్నంను ఏఐసీసీ కార్యదర్శిగా నియమిస్తారని సమాచారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పొన్నం ప్రభాకర్ స్థానంలో ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా కొనసాగుతున్న మహేశ్‌కుమార్‌గౌడ్‌కు పదవి ఇస్తారని ప్రచారం ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా శ్రీధర్‌బాబును నియమించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. త్వరలో పునర్ వ్యవస్థీకరణ చేపడుతారని తెలుస్తోంది.
Cabinet Reshuffle | పంచాయతీ ఎన్నికల తర్వాతే..
రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ప్రక్రియ సాగుతోంది. డిసెంబర్ 17న మూడో దశ ఎన్నికలు ముగియనున్నాయి. ఆ తర్వాతే మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.