HomeUncategorizedTrump Tariffs | ట్రంప్‌కు షాక్‌.. సుంకాల‌ను త‌ప్పుబ‌ట్టిన కోర్టు.. టారిఫ్‌లు రాజ్యాంగ విరుద్ధ‌మ‌న్న అప్పీల్...

Trump Tariffs | ట్రంప్‌కు షాక్‌.. సుంకాల‌ను త‌ప్పుబ‌ట్టిన కోర్టు.. టారిఫ్‌లు రాజ్యాంగ విరుద్ధ‌మ‌న్న అప్పీల్ కోర్టు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Trump Tariffs | ప్ర‌పంచ దేశాల‌పై ఎడాపెడా టారిఫ్‌లు విధిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు షాక్ త‌గిలింది. సుంకాల పెంపు రాజ్యాంగ విరుద్ధమని, ఆ చట్టబద్ధ హక్కు ట్రంప్‌కు లేదని యూఎస్‌ ఫెడరల్ అప్పీల్ కోర్టు (US Federal Appeals Court) స్ప‌ష్టం చేసింది.

ట్రంప్ యంత్రాంగం విధించిన సుంకాలు చట్టాల‌కు అనుగుణంగా లేవని తీర్పునిచ్చింది. అటువంటి సుంకాలను విధించే అధికారం శాసనసభ శాఖకు ఉందని పేర్కొంది. అయితే కోర్టు తీర్పుపై ట్రంప్ (Donald Trump) స్పందించారు. అది త‌ప్పుడు తీర్పు అని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. సుంకాలను రద్దు చేస్తే అమెరికా ఆర్థికంగా బలహీనపడుతుందని హెచ్చరించారు. సుంకాలు ఇప్పటికీ అమలులో ఉన్నాయని అన్నారు.

Trump Tariffs | అధ్య‌క్షుడికి ఆ అధికారం లేదు..

దేశాల‌పై సుంకాలు విధించడానికి అధ్యక్షుడికి అధికారం లేద‌ని అప్పీల్ కోర్టు పేర్కొంది. ట్రంప్ చేసిన విధంగా సుంకాలు (Tariffs) విధించే అధికారాన్ని అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం అధ్యక్షుడికి ఇవ్వదని కోర్టు తీర్పు ఇచ్చింది. ట్రంప్ తన అధికారాలను అధిగమించి వ్య‌వ‌హ‌రించారని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. రాజ్యాంగం అధ్యక్షుడికి కాకుండా కాంగ్రెస్‌కు పన్నులు విధించే అధికారాన్ని ఇస్తుందని వివరించారు. సుంకాలతో సహా పన్నులు విధించే అధికారాన్ని రాజ్యాంగం ఇస్తుందని వివరించారు.

Trump Tariffs | తీర్పు పక్ష‌పాతం..

సుంకాలు రాజ్యాంగ విరుద్ధ‌మ‌న్న అప్పీల్ కోర్టు తీర్పును ట్రంప్ తీవ్రంగా ఆక్షేపించారు. ఆ తీర్పు అత్యంత ప‌క్ష‌పాత‌మ‌ని వ్యాఖ్యానించారు. “అన్ని సుంకాలు ఇప్పటికీ అమలులో ఉన్నాయి. నేడు అత్యంత పక్షపాతంగా అప్పీళ్ల కోర్టు మన సుంకాలను తొలగించాలని తప్పుగా చెప్పింది. కానీ అంతిమంగా అమెరికా(America) గెలుస్తుందని వారికి తెలుసు. ఈ సుంకాలు ఎప్పుడైనా తొలగిపోతే, అది దేశానికి పూర్తిగా విపత్తు అవుతుంది. ఇది మనల్ని ఆర్థికంగా బలహీనపరుస్తుంది. మనం బలంగా ఉండాలి. మన తయారీదారులు, రైతులు, మిగతా వారందరినీ అణగదొక్కే అపారమైన వాణిజ్య లోటు, ఇతర దేశాలు విధించే అన్యాయమైన సుంకాలను, వాణిజ్య అడ్డంకులను అమెరికా ఇకపై సహించదు. దీనిని అనుమతించినట్లయితే, ఈ నిర్ణయం అమెరికాను అక్షరాలా నాశనం చేస్తుంది, ”అని ట్రంప్ త‌న ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.

చాలా సంవత్సరాలుగా నిర్లక్ష్యంగా, తెలివితక్కువగా మ‌న‌ రాజకీయ నాయకులు సుంకాలను మనకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి అనుమతించారని పేర్కొన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు సహాయంతో తాము దేశ ప్రయోజనాలను కాపాడ‌తామ‌ని, అమెరికాను మళ్లీ బలంగా, శక్తివంతంగా చేస్తామన్నారు.