HomeజాతీయంFitness Charges | వాహనదారులకు షాక్​.. భారీగా ఫిట్​నెస్​ ఛార్జీల పెంపు

Fitness Charges | వాహనదారులకు షాక్​.. భారీగా ఫిట్​నెస్​ ఛార్జీల పెంపు

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వాహన ఫిట్‌నెస్ పరీక్ష ఛార్జీలను 10 రెట్లు పెంచింది. ఫిట్​నెస్ లేని వాహనాలను తొలిగించే లక్ష్యంతో ఫిట్‌నెస్ ఫీజుల పరిధిలోకి వచ్చే వాహనాల వయస్సు పరిమితిని తగ్గించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fitness Charges | కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు షాకింగ్​ న్యూస్​ చెప్పింది. వాహనాల ఫిట్​నెస్​ ఛార్జీలను భారీగా పెంచింది. అంతేగాకుండా వాహనాల ఫిట్​నెస్​ విషయంలో మూడు స్లాబులను కొత్తగా తీసుకొచ్చింది.

కేంద్ర మోటారు వాహన నిబంధనల సవరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వాహన ఫిట్‌నెస్ పరీక్ష ఛార్జీలను 10 రెట్లు పెంచింది. ఫిట్​నెస్ లేని వాహనాలను తొలిగించే లక్ష్యంతో కేంద్రం ఫిట్‌నెస్ ఫీజుల పరిధిలోకి వచ్చే వాహనాల వయస్సు పరిమితిని తగ్గించింది. గతంలో 15 ఏళ్లు పూర్తయిన వాహనాలకు మాత్రమే ఫిట్​నెస్​ ఛార్జీలు వసూలు చేసేవారు. కానీ ప్రస్తుతం పదేళ్ల నుంచే ఫీజులు వసూలుకు కేంద్రం నిర్ణయించింది.

Fitness Charges | మూడు స్లాబులు

గతంలో 15 ఏళ్లు పైబడిన వాహనాలకు ఫిట్​నెస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉండేది. అయితే ప్రస్తుతం దానిని మూడు స్లాబులుగా విభజించారు. దీని ప్రకారం.. 10 నుంచి 15 ఏళ్ల మధ్య వాహనాలు, 15–20 ఏళ్ల మధ్య వాహనాలు, 20 ఏళ్ల కంటే పాత వాహనాలకు ఇక నుంచి ఫిట్​నెస్​ ఛార్జీలు వసూలు చేయనున్నారు. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, తేలికపాటి మోటారు వాహనాలు, భారీ వాహనాలు సహా అన్ని వర్గాల వాహనాలకు వాహన ఫిట్‌నెస్ పరీక్ష స్లాబ్‌లు వర్తిస్తాయి.

Fitness Charges | కొత్త ఫీజుల వివరాలు..

కేంద్రం తాజాగా పలు వాహనాల ఫిట్​నెస్​ ఛార్జీలను దాదాపు 10 రెట్లు పెంచింది. 20 ఏళ్లు దాటిన ట్రక్కు, బస్సుకు గతంలో రూ.2,500 ఫీజు ఉండగా.. ప్రస్తుతం అది రూ.25 వేలకు పెరిగింది. 20 ఏళ్లు దాటిన మీడియం కమర్షియల్‌ వెహికల్స్‌కు ఫీజును రూ.1,800 నుంచి రూ.20 వేలకు పెంచింది. లైట్​ మోటార్‌ వెహికల్స్​కు గతంలో ఎలాంటి ఫీజు ఉండేది కాదు. కానీ ప్రస్తుతం 20 ఏళ్లు దాటితే రూ.15 వేలు చెల్లించాలి. త్రిచక్ర వాహనదారులు రూ.7వేలు, ద్విచక్ర వాహనదారులు రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వాహనాలకు ఫిట్‌నెస్ ఫీజులను కూడా పెంచింది. 10 నుంచి 15 ఏళ్ల మీడియం హెవీ కమర్షియల్ వాహనాలు రూ.1,000 ఫిట్‌నెస్ పరీక్ష ఫీజు చెల్లించాలి. లైట్ మోటార్ వాహనాలు రూ.600, మోటార్ సైకిళ్లు రూ.400 ఫిట్​నెస్​ పరీక్ష కోసం చెల్లించాలి.

Fitness Charges | కాలుష్యం తగ్గించడానికి..

పాత వాహనాలతో కాలుష్య (Pollution) ఉద్గారకాలు విపరీతంగా వెలువడుతాయి. దీంతో కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఫిట్​నెస్​ ఛార్జీలను పెంచింది. కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలను తొలగించాలనే రేట్లను సవరించినట్లు ప్రభుత్వం వివరించింది. దీంతో వెహికల్‌ స్క్రాపేజ్‌ పాలసీకి మద్దతు లభిస్తుందని తెలిపింది. ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఫీజులు భారీగా ఉంటే ఓనర్లు అంత మొత్తం చెల్లించడానికి బదులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతారని అభిప్రాయపడింది.