అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | శాంతి మార్గమే శరణ్యం అంటూ రష్యా– ఉక్రెయిన్ (Russia-Ukraine) మధ్య జరుగుతున్న యుద్ధంపై ఏడో తరగతి విద్యార్థి రూపొందించిన ప్రాజెక్టును ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అభినందించారు. మాచారెడ్డి మండలం మర్రి తండాకు చెందిన సబావత్ సదర్ నాయక్ కుమారుడు అభిమన్యు ప్రస్తుతం కొంపల్లి శ్రీ చైతన్య పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.
Kamareddy SP | రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో..
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine war) సృష్టిస్తున్న విధ్వంసాన్ని చూసి అభిమన్యు చలించిపోయాడు. ఎక్కడో జరుగుతున్న యుద్ధం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం, లక్షలాది మంది నిరాశ్రయులవ్వడం ఆ బాలుడిని తీవ్రంగా ఆలోచింపజేసింది. ఇదే విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలనే ఉద్దేశంతో అభిమన్యు మనుషుల మనసుని సైతం కరిగించే ప్రాజెక్టును కళ్లకు కట్టినట్లుగా సిద్ధం చేశాడు.
Kamareddy SP | యుద్ధం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ..
యుద్ధం వల్ల కలిగే నష్టాలను, ప్రపంచానికి శాంతి ఎంత అవసరమో వివరిస్తూ తను రూపొందించిన ఆ ప్రాజెక్టును తన తండ్రి సదర్ నాయక్తో కలిసి సోమవారం ఎస్పీకి వివరించాడు. చిన్న వయసులోనే ప్రపంచ శాంతి పట్ల అభిమన్యు చూపిస్తున్న తపనను చూసి ఎస్పీ అభినందించారు. బాలుడు సిద్ధం చేసిన ప్రాజెక్టును ఆసక్తిగా పరిశీలించి, అతని మాటలను ఎంతో శ్రద్ధగా విన్నారు. అనంతరం అభిమన్యు కోరిక మేరకు ఆటోగ్రాఫ్ ఇచ్చి బాలుడిని ప్రోత్సహించారు.