అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs NZ | న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను ఘనంగా ఆరంభించిన టీమిండియా (Team India), ఇప్పుడు రెండో పోరుకు సిద్ధమైంది. శుక్రవారం రాయ్‌పూర్ (Raipur) వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో తొలి టీ20లోని ఉత్సాహాన్నే కొనసాగిస్తూ మరో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యాన్ని 2-0కి పెంచుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో చేసిన తప్పిదాలను సరిదిద్దుకుని పుంజుకోవాలనే లక్ష్యంతో న్యూజిలాండ్ బరిలోకి దిగనుంది.
దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలి టీ20లో బౌలింగ్ చేస్తూ గాయపడిన అక్షర్ పటేల్ (Axar Patel) రెండో టీ20 ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. డారిల్ మిచెల్ ఇచ్చిన కష్టతరమైన రిటర్న్ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అక్షర్ ఎడమచేతి చూపుడువేలికి గాయమైంది.
IND vs NZ | కాంబినేషన్‌లో పెద్ద మార్పుల్లేవు
బంతి బలంగా తాకడంతో రక్తస్రావం కూడా కావడంతో అతను మైదానం విడిచాడు. ఆ తర్వాత ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. ఈ గాయంపై బీసీసీఐ (BCCI)నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. ముందస్తు జాగ్రత్తగా అతన్ని కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ లేదా రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్షర్ తప్పితే మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు ఉండవని సంకేతాలు కనిపిస్తున్నాయి. తొలి టీ20 విజయం తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ 8 మంది బ్యాటర్లు, ముగ్గురు స్ట్రైక్ బౌలర్ల కాంబినేషన్ బాగా పనిచేసిందని, అదే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో తొలి మ్యాచ్ ఆడిన ఆటగాళ్లే రెండో టీ20లోనూ కొనసాగనున్నారు. దీంతో శ్రేయస్ అయ్యర్, హర్షిత్ రాణాలకు మరోసారి నిరాశ తప్పేలా లేదు.
ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ మళ్లీ బరిలోకి దిగనున్నారు. తొలి మ్యాచ్‌లో అభిషేక్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా, సంజూ మాత్రం నిరాశపరిచాడు. తిలక్ వర్మ గైర్హాజరీలో ఫస్ట్ డౌన్‌లో అవకాశం దక్కిన ఇషాన్ కిషన్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో ఈ ఇద్దరూ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అయితే అతని నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ ఇంకా రావాల్సి ఉంది. మధ్య ఓవర్లలో హార్దిక్ పాండ్యా, డెత్ ఓవర్లలో రింకూ సింగ్ సత్తా చాటగా, శివమ్ దూబే మాత్రం తొలి మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయాడు. దూబే కూడా టచ్‌లోకి వస్తే భారత బ్యాటింగ్ మరింత బలపడుతుంది.
బౌలింగ్ విభాగంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ (Varun Chakravarthy) తొలి మ్యాచ్‌లోనే తన ప్రభావాన్ని చూపించాడు. అతనికి తోడుగా కుల్దీప్ లేదా బిష్ణోయ్ చేరితే స్పిన్ విభాగం మరింత బలపడనుంది. పేస్ దాడికి జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ నేతృత్వం వహించనున్నారు. పవర్‌ప్లేలో వికెట్లు తీసే సామర్థ్యం, డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ భారత జట్టుకు పెద్ద బలం.
IND vs NZ | రెండో టీ20కు భారత తుది జట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్ / కుల్దీప్ యాదవ్ / రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.