అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Scrub Typhus | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో స్క్రబ్ టైఫస్ విజృంభిస్తుంది. దీని ప్రభావంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఐదుగురు మృతి చెందారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
విజయనగరం (Vizianagaram), పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లా (Nellore District)లకు చెందిన వారు స్క్రబ్ టైఫస్‌తో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యాధి ప్రాణంతకమైంది. దీనిని ఇప్పటి వరకు టీకా అందుబాటులో లేదు. దీంతో ముందు జాగ్రత్తలే ఏకైక మార్గమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో గత కొన్నేళ్లుగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ప్రస్తుతం మరణాలు చోటు చేసుకుంటుండం ఆందోళన కలిగిస్తోంది.
ఏదైనా కీటకం కుట్టినట్లు అనిపించినా.. కాలిన గాయం లాంటి మచ్చలు లేదా దద్దుర్లు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు ఒకటి, రెండు రోజులు ఉంటే అప్రమత్తం కావాలి. ప్రాథమిక దశలో వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే నయం అవుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది.
Scrub Typhus | ఇలా వ్యాపిస్తుంది.
ఓరింయెంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియాతో స్క్రబ్ టైఫస్ వ్యాధి వ్యాపిస్తుంది. నల్లిని పోలిన ‘చిగ్గర్ మైట్’ (Chigger Mite) కీటకం కాటు ద్వారా ఇది మనుషులకు సోకుతుంది. అయితే ఇది అంటు వ్యాధి కాదు. పొలాల్లో, తోటల్లో పనిచేసే రైతులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వ్యాధి సోకి ఇప్పటి వరకు విజయనగరం జిల్లాకు చెందిన సీహెచ్ రాజేశ్వరి, పల్నాడుకు చెందిన ఎం.జ్యోతి, వై నాగమ్మ, బాపట్ల జిల్లాకు చెందిన ఎస్‌కే మస్తాన్‌బీ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సంతోషి చనిపోయారు.
