అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CP Sajjanar | సోషల్ మీడియా వేదికగా నిత్యం అనేక మోసాలు జరుగుతున్నాయి. ప్రజలను నమ్మించి కొందరు డబ్బులు కాజేస్తున్నారు.
ఇటీవల లక్కీ డ్రాల పేరిట మోసాలు పెరిగాయి. ఇన్స్టాగ్రామ్ (Instagram)లో ఇటువంటి రీల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రూ.100కే రూ.లక్ష విలువైన వస్తువులు గెలుచుకోవచ్చు అంటూ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు (Social Media Influencers) వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. బైక్‌లు, స్థలాలు, కార్లు, ఇతర వస్తువులు లక్కీ డ్రాలో సొంతం చేసుకోవచ్చని నమ్మిస్తున్నారు. పలువురు ప్రజలు సైతం తమ ఇల్లు, ప్లాట్లను లక్కీ డ్రా రూపంలో విక్రయించడానికి యత్నిస్తున్నారు.
CP Sajjanar | నిషేధం ఉన్నా..
రాష్ట్రంలో లక్కీ డ్రాలు, లాటరీలపై నిషేధం ఉంది. అయినా కొందరు లక్కీడ్రాల (Lucky Draws) పేరిట ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. పలాన నంబర్‌కు అమౌంట్ పంపితే లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. విలువైన బహుమతులు వస్తాయని నమ్మిస్తున్నారు. దీంతో చాలా మంది సోషల్ మీడియా (Social Media)లో వచ్చే రీల్స్ చూసి వారు చెప్పిన అకౌంట్లకు డబ్బులు పంపుతున్నారు. అయితే చాలా మంది ఎలాంటి బహుమతులు ఇవ్వకుండానే మోసం చేస్తున్నారు. అయితే తక్కువ మొత్తం లాటరీ కోసం చెల్లిస్తుండటంతో ప్రజలు సైతం ఫిర్యాదు చేయడం లేదు. తమ దృష్టికి వచ్చిన లక్కీడ్రాలపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ తాజాగా ఎక్స్ వేదికగా లక్కీడ్రా నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు.
CP Sajjanar | కఠిన చర్యలు తీసుకుంటాం
లక్కీ డ్రా ఇన్‌ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు. సోషల్ మీడియాలో కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కార్లు, బైకులు, ప్లాట్లు, డీజేలు ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బెట్టింగ్ యాప్‌ల (Betting Apps) ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలతో వీళ్లు దర్శనమిస్తున్నారని చెప్పారు. ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని నిండా ముంచుతున్న ఇన్ఫ్లూయెన్సర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోసాలకు పాల్పడే వారు సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్లైనా సరే.. ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు.