అక్షరటుడే, కామారెడ్డి : PCC Chief | ప్రభుత్వం నడవాలంటే సర్పంచులే పునాది రాయి అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులోని కింగ్స్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నియోజకవర్గంలో గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
PCC Chief | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మరెక్కడా లేదు..
ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. రెండేళ్లలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఈ దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. ప్రతివర్గానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses), రేషన్ కార్డులు ఇస్తున్నామని, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తున్నామని తెలిపారు. విద్య, వైద్యంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తోందన్నారు. కాంగ్రెస్ (Congress Party) పేదల పక్షపాతి పార్టీ అని పేర్కొన్నారు. రాజకీయ జీవితంలో సర్పంచ్ పదవి పునాది రాయి అని, సర్పంచ్ పదవిలో రాణిస్తే భవిష్యత్తులో మంచి నాయకులవుతారని, పదవులు అవే వస్తాయన్నారు.
PCC Chief | గాంధీ పేరు మార్చడం కుట్రే..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Government) ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగించి పథకాన్ని నీరుగార్చే కుట్ర చేస్తోందని పీసీసీ చీఫ్ ఆరోపించారు. దీనిపై ఈనెల 26న ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు. దేవుణ్ణి గౌరవించడం వేరు.. దేవుని పేరుతో రాజకీయం చేయడం వేరని తెలిపారు. ప్రతి ఎన్నికల్లో శ్రీరాముని పేరుమీద బీజేపీ ఓట్లు అడుగుతుందని, బీజేపీకి శ్రీరామునికి ఏం సంబంధం.. శ్రీరామునికి బీజేపీలో ఏమైనా సభ్యత్వం ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తే హిందూ ముస్లిం తగాదా పెడుతుందని, ఏనాడైనా మేము దేవుడి పేరుతో ఓట్లు అడిగామా అని ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్ (MP Arvind) దేవుని పేరు చెప్పకుండా 10 వేల ఓట్లు తెచ్చుకోవాలని సూచించారు.
PCC Chief | ఏడేళ్లుగా ఎంపీగా ఉండి ఏం చేశావు..
అర్వింద్ ఏడేళ్లుగా ఎంపీగా ఉన్నారని.. జిల్లాకు ఏమి తెచ్చారని.. ఇప్పుడెలా ఓట్లు అడుగుతావని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలు, యువతకు ఏం చేస్తారో చెప్పాలన్నారు. ఆ దమ్ము బీజేపీకి (BJP) లేదన్నారు. రాజకీయాలకు దేవుణ్ణి ముడిపెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 8 మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని, ఫిబ్రవరిలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు చెప్పినవన్నీ చేస్తున్నామని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామన్నామని, అందుకే ధైర్యంగా ఓటు అడుగుతామని పేర్కొన్నారు. విశ్వ నగరాలతో పోటీ పడేలా ఫోర్త్ సిటీ రాబోతుందని, రాష్ట్రంలో రూ5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. పదేళ్లలో 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదని, తాము వచ్చిన రెండేళ్లలో 80 వేల ఉద్యోగాలిచ్చామని తెలిపారు. గ్రామాల్లో సర్పంచులు ప్రజలకు మంచి పాలన అందించాలని, తద్వారా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.