అక్షరటుడే, వెబ్డెస్క్ : Samantha Marriage | ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ప్రతిష్ఠించిన శక్తివంతమైన స్త్రీలింగ రూపం లింగ భైరవి దేవి. నిత్యం పూజలతో ప్రసిద్ధి చెందిన లింగ భైరవి దేవిని ఈషా యోగా కేంద్రంలో ప్రతిష్ఠించారు.
ఆధ్యాత్మిక శక్తి, శ్రేయస్సు, మోక్షానికి ప్రతీకగా భావించే ఈ దేవతను ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది భక్తులు దర్శించుకుంటుంటారు. సాధారణ విగ్రహ రూపానికి భిన్నంగా ప్రత్యేక లింగ ఆకారంలో ప్రతిష్ఠించబడినందున ఈ దేవతకు “లింగ భైరవి” (Linga Bhaitavi) అనే పేరు వచ్చింది. తాంత్రిక–యోగా సంప్రదాయాల ఆధారంగా రూపొందిన ఈ లింగ రూపం మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక చక్రాలకు సంకేతంగా కూడా చెప్పబడుతుంది. భక్తుల్లో భయం తొలగించడం, ఆరోగ్యం, శ్రేయస్సు, వైవాహిక సామరస్యం, వ్యాపార విజయం, చివరకు ఆధ్యాత్మిక విముక్తి వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయని విశ్వాసం.
Samantha Marriage | ‘భూత శుద్ధి వివాహం’ ఎందుకు?
ప్రతిరోజూ ప్రత్యేక ఆర్తులు, అభిషేకాలు, శక్తివంతమైన పూజలు జరిగే ఈ ఆలయం ప్రపంచం నలుమూలల ఆధ్యాత్మిక సాధకులను ఆకర్షిస్తోంది. ఇలాంటి ఆధ్యాత్మిక శక్తి నిలయంగా పేరుపొందిన ఈశా యోగా కేంద్రంలోనే డిసెంబర్ 1న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Heroine Samantha) తన రెండో వివాహాన్ని జరుపుకుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో సమంత అత్యంత ప్రైవేటుగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ లింగ భైరవి సన్నిధిలో పెళ్లి చేసుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది.
గత కొంతకాలంగా ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపుతున్న సమంత, వ్యక్తిగత సమస్యల వలన లింగ భైరవి ఆలయాన్ని పలుమార్లు దర్శించి, ధ్యానంలో కూర్చుంది. దాంతో ఆ శక్తి తనకు ధైర్యాన్ని ఇచ్చిందని పలు సందర్భాల్లో పేర్కొంది. ఈ ఆధ్యాత్మిక అనుబంధమే ఆమెను ఈ పవిత్ర స్థలంలో వివాహం చేసుకోవడానికి ప్రేరేపించింది. ఈ పెళ్లి సాధారణ హిందూ వివాహంలా కాకుండా ‘భూత శుద్ధి వివాహం’ (Bhoot Shuddi Vivaham) అనే పురాతన యోగ సంప్రదాయం ప్రకారం జరిగింది. భూత శుద్ధి అంటే శరీరంలోని పంచభూతాలను భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం శుద్ధి చేసే ప్రక్రియ. ఈ పద్ధతిలో వధూవరులు శరీరం,మనస్సును శుద్ధి చేసే ప్రత్యేక కర్మలను నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక యోగిక వివాహం ద్వారా దంపతుల మధ్య కేవలం భావోద్వేగంగానే కాదు; పంచభూతాల స్థాయిలో కూడా లోతైన బంధం ఏర్పడుతుందని నమ్మకం. దీనితో వారి దాంపత్య జీవితం మరింత శ్రేయస్సు, సమతుల్యత, ఆధ్యాత్మిక అనుబంధంతో నిండి ఉంటుందని విశ్వసిస్తారు.
సమంత గతంలో ఎదురుకున్న వ్యక్తిగత ఇబ్బందులు మళ్లీ రాకూడదనే భావన, ఆధ్యాత్మికతపై పెరిగిన నమ్మకం, లింగ భైరవి దేవి పట్ల ఉన్న ఆరాధన ఈ అన్నిటి సమ్మేళనంగానే ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్నట్టు దగ్గరి వర్గాలు చెబుతున్నాయి.
