HomeతెలంగాణHyderabad CP | డ్రగ్స్​పై ఉక్కుపాదం.. హైదరాబాద్​ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్

Hyderabad CP | డ్రగ్స్​పై ఉక్కుపాదం.. హైదరాబాద్​ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad CP | హైదరాబాద్​ నగర పోలీస్ కమిషనర్​గా వీసీ సజ్జనార్​ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఇటీవల ఆయనను సీపీగా నియమించిన విషయం తెలిసిందే.

రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులను ఇటీవల ట్రాన్స్​ఫర్​ చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ సీపీ(Hyderabad CP)గా కొనసాగుతున్న సీవీ ఆనంద్​ను హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. నగర సీపీగా ఆర్టీసీ ఎండీగా కొనసాగున్న సజ్జనార్​ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టే ముందు కమిషనరేట్ కార్యాలయంలో సజ్జనార్(Sajjanar) ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 Hyderabad CP | శాంతిభద్రతలు కాపాడుతాం

బాధ్యతలు స్వీకరించిన అనంతరం సజ్జనార్​ మీడియాతో మాట్లాడారు. సమర్థత, సమగ్రతతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. ప్రజలతో మమేకమై, వారి భద్రతకు భరోసా కల్పించే దిశగా పోలీస్ శాఖ(Police Department) పనిచేస్తుందని వెల్లడించారు. నగరంలో శాంతి భద్రతలను కాపాడుకోవడంపై దృష్టి సారిస్తామన్నారు. ఇంత పెద్ద నగరం బాధ్యతలు అప్పగించడంపై ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నగరంలో డ్రగ్స్​ అతి పెద్ద సమస్య అని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్​పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలతో యువత, వారి తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్​ దందా చేసే వారిని వదిలి పెట్టమని స్పష్టం చేశారు.

 Hyderabad CP | రెండు ఎన్​కౌంటర్లు

సజ్జనార్​ చాలా రోజుల తర్వాత పోలీస్​ యూనిఫామ్​ వేసుకున్నారు. ఆయన సుమారు 4 ఏళ్లు ఆర్టీసీ ఎండీగా కొనసాగారు. ఆయన జ‌న‌గామ ఏఎస్పీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. పులివెందుల ఏఎస్పీ, వరంగల్, మెదక్, నల్గొండ, గుంటూరు, కడపలో ఎస్పీగా, ఇంటెలిజెన్స్ ఐజీగా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పని చేశారు. వరంగల్​లో ఓ యువతిపై 2008లో యాసిడ్​ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు ఎన్​కౌంటర్​ చేశారు. ఆ సమయంలో సజ్జనార్​ ఎస్పీగా ఉన్నారు. శంషాబాద్​ సమీపంలో 2019లో వెటర్నరీ డాక్టర్​పై అత్యాచారం చేసిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్​కౌంటర్​ చేశారు. ఆ సమయంలో సైబరాబాద్​ సీపీగా సజ్జనార్​ ఉన్నారు.