అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | హైదరాబాద్ సీపీ సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు (Former Minister Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టుల అరెస్ట్‌పై ఆయన మాట్లాడారు.
ఎన్టీవీలో ఇటీవల ప్రసారం అయిన ఓ కథనానికి సంబంధించి ముగ్గురు జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐఏఎస్ అధికారిపై వార్త కథనం ప్రసారం చేయగా.. దానిని విచారించేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్‌కు సజ్జనార్ (Hyderabad CP Sajjana) నేతృత్వం వహిస్తున్నారు. జర్నలిస్ట్‌ల అరెస్ట్‌లపై ఆయన మాట్లాడుతూ.. చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నామన్నారు. మహిళా అధికారిపై విమర్శలు చేయడంపై కేసు నమోదు చేశామని తెలిపారు. విచారణకు రాకపోవడంతో జర్నలిస్టులను అరెస్ట్ చేశామన్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao | అప్పుడు ఏం చేశారు
కేటీఆర్ మీద మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు చట్టం ఎటు పోయిందని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ రోజు ఒక మహిళ మీద నిందలు వేస్తారా అంటున్నారని, మరి ఆనాడు కేటీఆర్ విషయంలో బాధపడింది కూడా ఒక మహిళే కదా అన్నారు. ఆ రోజు చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదన్నారు. అప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతోనే కేటీఆర్ కోర్టులో పరువు నష్టం దావా వేశారని గుర్తు చేశారు.
Harish Rao | మీడియాను బెదిరించే యత్నం
రాష్ట్రంలో మీడియాను బెదిరించే యత్నం జరుగుతోందని హరీశ్‌రావు అన్నారు. మీడియాను తన గుప్పెట్లో పెట్టుకోవాలని సీఎం యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీవీ భుజంపై తుపాకీ పెట్టి మీడియాను భయపెడుతున్నారని చెప్పారు. అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేసి వికృతానందం పొందుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదన్నారు. మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్నవాళ్లు బరితెగిస్తారని హరీశ్‌రావు పేర్కొన్నారు.