అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sai Pallavi | దక్షిణాది సినీ పరిశ్రమలో సహజ నటనతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి ఇప్పుడు మరో కీలక అడుగు వేస్తోంది. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో వరుసగా అర్థవంతమైన పాత్రలు చేస్తూ బలమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్న ఆమె, తాజాగా బాలీవుడ్ (Bollywood)లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది.
కన్నడను మినహాయిస్తే దాదాపు అన్ని ప్రధాన దక్షిణాది భాషల్లో నటించిన సాయి పల్లవి, హిందీ చిత్ర పరిశ్రమ (Hindi Film Industry)లో తన తొలి చిత్రంగా ‘ఏక్ దిన్’ సినిమాను ఎంపిక చేసుకుంది.ఈ చిత్రాన్ని బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన బ్యానర్‌లో నిర్మిస్తుండగా, ఆయన కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు.
Sai Pallavi | కొత్త వివాదం..
అయితే పోస్టర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియా (Social Media)లో అనూహ్యమైన చర్చ మొదలైంది. సినిమా టైటిల్‌తో పాటు పోస్టర్ డిజైన్ 2016లో విడుదలైన థాయ్ రొమాంటిక్ డ్రామా ‘వన్ డే’ను పోలి ఉందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. దీంతో కొంతమంది ఇది కాపీ సినిమా అంటూ విమర్శలు గుప్పించగా, మరికొందరు సృజనాత్మకత లోపించిందంటూ సెటైర్లు వేశారు. ముఖ్యంగా టైటిల్ మాత్రమే కాకుండా ప్రచార పోస్టర్లు కూడా అసలు సినిమానే గుర్తుకు తెస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విమర్శలపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.
ఇదిలా ఉండగా, తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ‘ఏక్ దిన్’ అనేది థాయ్ చిత్రం (Thai Movie)‘వన్ డే’కు అనధికార కాపీ కాదు, అధికారిక రీమేక్ అని తెలుస్తోంది. ఆమిర్ ఖాన్ ఈ కథ నచ్చి రీమేక్ హక్కులు తీసుకొని స్వయంగా నిర్మిస్తున్నారని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2016లో విడుదలైన ‘వన్ డే’ థాయ్‌లాండ్‌లోనే కాదు, సింగపూర్, వియత్నాం వంటి దేశాల్లో కూడా మంచి విజయాన్ని సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాల్లో అవార్డులు కూడా దక్కించుకుంది.ఈ నేపథ్యంలో రీమేక్ చేయడంలో తప్పేమీ లేదని, కానీ టైటిల్, ప్రమోషనల్ మెటీరియల్ విషయంలోనైనా కొత్తదనం చూపించాల్సిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా క్రియేటివిటీకి పెద్దపీట వేసే ఆమిర్ ఖాన్, తన కుమారుడి సినిమాకు వచ్చేసరికి ఎందుకు ఇంత సేఫ్ గేమ్ ఆడుతున్నాడనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మే 1న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా, ఫస్ట్ లుక్‌తోనే విమర్శలతో పాటు ఆసక్తిని కూడా రేపుతోంది. సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీకి ఇది ఎంతవరకు ప్లస్ అవుతుందో, అలాగే జునైద్ ఖాన్‌కు ఈ సినిమా బ్రేక్ ఇస్తుందో చూడాలి మరి.