అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Saeed Ajmal | పాకిస్తాన్ క్రికెట్‌ను ప్రపంచస్థాయిలో గర్వపడేలా చేసిన 2009 టీ20 వరల్డ్‌కప్ విజయం ఇప్పటికీ అభిమానుల్లో గుర్తుండే ఘట్టం. అయితే ఆ చారిత్రాత్మక విజయం వెనక కఠిన వాస్తవాలు దాగున్నాయని, ఆటగాళ్లకు తగిన గుర్తింపు దక్కలేదని ఆ జట్టు సభ్యుల్లో ఒకరైన మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ (Saeed Ajmal) తాజాగా సంచలన విషయాలు బయటపెట్టారు.
2009 వరల్డ్‌కప్ (2009 World Cup) గెలిచిన తర్వాత అప్పటి పాక్ ప్రధానమంత్రి తాము అందరికీ రూ.25 లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారని, బ్యాంక్ చెక్ కూడా ఇచ్చారని అజ్మల్ వెల్లడించారు. ఆ చెక్కులు చాలా సంతోషం కలిగించాయి. కానీ బ్యాంకుకు వెళ్తే అవి బౌన్స్ (Check Bounce) అయ్యాయని తెలిసి షాకయ్యాం అని వ్యాఖ్యానించారు. తాము ప్రభుత్వంపై నమ్మకంతో ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ఇలా జరగడం ఎంతో బాధ కలిగించిందని తెలిపారు.
Saeed Ajmal | పీసీబీ నిర్లక్ష్యం..
ఆ సమయంలో ఆటగాళ్లంతా పాక్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) సాయం కోరినప్పటికీ, ఎటువంటి సహకారం ఇవ్వలేదని అజ్మల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లను సాంత్వన పరచాల్సిన బోర్డు.. మమ్మల్ని పూర్తిగా విస్మరించింది. ఎవరూ పట్టించుకోలేదు అని అన్నారు. వాస్తవానికి 2009 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన జట్టుకు ఐసీసీ ఇచ్చిన ప్రైజ్ మనీ మినహా, ఇతర బహుమతులు ఏవీ లభించలేదని చెప్పారు. మిగతా దేశాల్లో విన్నింగ్ బోనస్‌లు, ప్రభుత్వాలు ఇచ్చే బహుమతులు ఆటగాళ్లకు పెద్ద ఉత్సాహాన్నిస్తే, పాక్ ఆటగాళ్లకు అవి మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు.
ఇటీవల UAEలో జరిగిన ఆసియా కప్ 2025లో విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.21 కోట్లు ప్రోత్సాహక బహుమతిగా ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు కోచింగ్ స్టాఫ్‌కు కూడా గుర్తింపు ఇచ్చింది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌పై భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ అద్భుతంగా 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత జట్టు 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన క్లిష్ట పరిస్థితిలో తిలక్ తన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. అయితే సయీద్ అజ్మల్ చేసిన ఆరోపణలు పాకిస్తాన్ క్రికెట్ పరిపాలనలో వ్యవస్థాపక లోపాలు, ప్రభుత్వ నిబద్ధత లోపాన్ని బహిర్గతం చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ ఛాంపియన్స్‌కు తగిన గుర్తింపు లేకపోతే, తర్వాత తరాలకు ఎంత ప్రోత్సాహం ఉంటుంది? అనే ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి.