అక్షరటుడే, కామారెడ్డి: MGNREGA | ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని గురువారం సాయంత్రం జీఆర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. జీ రాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ యుద్ధం చేస్తోందని, లోక్ సభలో 100 మందికి పైగా ఎంపీలు దీనిపై కొట్లాడతారని పేర్కొన్నారు.
MGNREGA | ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల అమలు
కేంద్రంలోని బీజేపీ పేద ప్రజల సంక్షేమం కోసం కాకుండా ధనవంతుల కోసం పని చేస్తుందని ఆరోపించారు. గాంధీ వాదం పేరు చెబుతూనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేస్తోందన్నారు. ఇందిరాగాంధీ హయాంలో పేద ప్రజల కోసం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ పథకాన్ని రూపు మాపేందుకు కుట్ర చేస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న అన్ని గ్రామాల్లో తీర్మానాలు చేస్తామని తెలిపారు.
MGNREGA | పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు
జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కాంగ్రెస్ సాధించిందని ఏఐసీసీ కార్యదర్శి అన్నారు. నాలుగు మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్న విశ్వాసం ఉందన్నారు. అనంతరం పలువురు నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు దరఖాస్తులను సమర్పించారని చెప్పారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీలు చంద్రశేఖర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.