అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RSS | రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశ సేవలో ఎప్పుడూ ముందుంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఢిల్లీ (Delhi)లోని బీఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరుగుతున్న వేడుకల్లో ప్రధాని పాల్గొని మాట్లాడారు.
ఆర్ఎస్ఎస్ను డాక్టర్ హెడ్గేవర్ 1925లో విజయ దశమి (Vijaya Dasami) రోజు ప్రారంభించారు. కొంత మందితో ప్రారంభమైన సంస్థ ఇప్పుడు లక్షల మంది స్వయం సేవకులతో విస్తరించింది. ఈ క్రమంలో శతాబ్ది ఉత్సవాలను దేశవ్యాప్తంగా స్వయం సేవకులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఢిల్లీలో జరిగిన వేడుకలకు హాజరైన మోదీ ఆర్ఎస్ఎస్ సేవలకు గుర్తుగా రూ.100 నాణెం, పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు.
RSS | ఎన్నో సేవా కార్యక్రమాలు
ప్రధాని మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ సేవకులకు అభినందనలు తెలిపారు. వందేళ్లలో ఆర్ఎస్ఎస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందన్నారు. ఆర్ఎస్ఎస్ అంటే విజయం అని పేర్కొన్నారు. ఆ సంస్థకు దేశమే ముఖ్యమని చెప్పారు. దేశమే ప్రథమం అనేది ఆర్ఎస్ఎస్ విధానమని తెలిపారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సంఘ్ కృషి చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. వందేళ్ల క్రితం RSS ఒక సంస్థగా స్థాపించబడటం యాదృచ్చికం కాదని, వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయ పునరుత్థానం అని ఆయన అభివర్ణించారు.
RSS | చెడుపై మంచి విజయం
ఆర్ఎస్ఎస్ సేవకులు దేశానికి సేవ చేయడానికి అంకితభావంతో పని చేస్తారని ప్రధానమంత్రి అన్నారు. 1963లో జరిగిన గణతంత్ర దినోత్సవ (Republic Day) కవాతులో స్వయం సేవకులు పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. రేపు విజయ దశమి అని మోదీ చెప్పారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ అన్నారు.
కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ ప్రజలలో జాతి నిర్మాణం, సాంస్కృతిక అవగాహనను పెంపొందించిందన్నారు. ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే మాట్లాడుతూ.. సంఘ్ పనులు, కార్యకలాపాలను దేశంలోని ప్రతి మూలలోనూ చూడవచ్చని చెప్పారు.