అక్షరటుడే, వెబ్డెస్క్ : Nizamabad | నిజామాబాద్ నగరం (Nizamabad City)లో రోడ్లు అధ్వానంగా మారాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రహదారులు సైతం గుంతలమయంగా మారాయి.
ఇటీవల కర్నూల్లో రోడ్డు ప్రమాదం (Kurnool Road Accident) జరిగి 19 ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (Chevella)లో బస్సును టిప్పర్ ఢీకొనడంతో 19 మంది దుర్మరణం చెందారు. అయితే ఈ ప్రమాదానికి కారణం రోడ్డుపై ఉన్న గుంత అని పోలీసులు తెలిపారు. టిప్పర్ డ్రైవర్ అతి వేగంగా ఉన్న సమయంలో గుంతను తప్పించే యత్నం చేయగా.. బస్సును ఢీకొంది.
నిజామాబాద్ నగరంలో సైతం అనేక గుంతలు ఉన్నాయి. అడుగుకో గుంత ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా గుంతల మూలంగా నిత్యం ఎంతోమంది ప్రమాదాల బారిన పడుతున్నారు. అయినా అధికారలు రోడ్లకు మరమ్మతులు చేపట్టడం లేదు. చౌరస్తాల దగ్గర రోడ్లు మరీ ఘోరంగా తయారు అయ్యాయి. దేవీ థియేటర్ (Devi Theatre)కు వెళ్లే చౌరస్తా వద్ద రోడ్డు అధ్వానంగా మారింది. నగరంలో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు.. ముందే గుంతలను పూడిస్తే ప్రాణాలు కాపాడిన వారు అవుతారని అంటున్నారు.
